ఎన్నారై భర్తల ఆగడాలకు చెక్ పెట్టిన కేంద్రం..!

SMTV Desk 2017-09-18 11:49:21  NRI, Matrimony, Central Government, Marriages

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: భార్యలను వేధింపులకు గురిచేస్తున్న ఎన్నారై భర్తల ఆగడాలకు అడ్డుకట్టవేసే దిశగా కేంద్రం ప్రభుత్వం అడుగులు వేస్తుంది. విదేశాల్లో కొలువులు, లక్షల్లో జీతాలు అంటే చాలు కోట్లలో వరకట్నం ఇచ్చి తల్లిదండ్రులు వారి కుమార్తెలను ఎన్నారైలకు కట్టబెడుతున్న విషయం విదితమే. అయితే ఇలా వివాహం చేసుకున్న వారిలో ఎక్కువ శాతం పెళ్లిళ్ళు ఏడాది గడవక ముందే విడాకులకు దారి తీస్తున్నాయి. దీనికి కారణాలు సైతం లేకపోలేదు. వేతనాలను మాత్రమే చూసి వివాహం చేసేందుకు సిద్ధపడుతున్న నేటి కొత్తతరం తల్లిదండ్రులు కనీసం వరుడి వివరాలు తేలుసుకోకుండానే, తమ కుమార్తెను ఏలా ఏలుకుంటాడనే ఆలోచన చేయకుండా వివాహలు చేసి మోసపోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. అంత సంపాదిస్తున్న వ్యక్తి ఎంత ఒత్తిడికి లోనవుతుంటాడని యువతులను కట్టబెట్టే తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచిస్తే, ఇంతటి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవలసిన పరిస్థితి తలెత్తదనే అభిప్రాయం అందరిలో వ్యక్తం అవుతుంది. గత కొంతకాలంగా ఈ ఎన్నారై భర్తల వేధింపులు తాలలేక పలు ఫిర్యాదులు విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి వచ్చాయి. ఈ నేపధ్యంలో ఎన్నారై బాధిత మహిళల రక్షణకు సాధ్యమైనన్ని చట్టపరమైన మార్గాలను సూచించేందుకు ఈ ఏడాది మే నెలలో కేంద్రం ఒక అత్యున్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయగా, ఈ మేరకు అధ్యయనం చేసిన కమిటీ పలు సూచనలు చేసింది. వాటిలో భార్యలను వేధించే ఎన్నారై భర్తల పాస్‌పోర్టులు రద్దు చేయాలని, ఎన్నారైల పెళ్లిలను ఖచ్చితంగా రిజిస్ట్రేషన్‌ చేయించాలని సూచించింది. ఎన్నారై భర్త సోషల్‌ సెక్యూరిటీ నెంబర్‌, పని ప్రదేశం పాటు ఇంటి చిరునామాలను పెళ్లి ధృవీకరణ పత్రాల్లో నమోదు చేయాలి. ఇంకా బాధిత మహిళలకు ఆయా దేశాల్లో భారతీయ దౌత్యకార్యాలయాలు అందించే సహాయాన్ని 3,000 డాలర్ల నుంచి 6,000 డాలర్లకు పెంచాలనే సూచనతో పాటు, గృహహింసను విదేశాలతో చేసుకునే ఒప్పందాల పరిధిలోకి తీసుకొనిరావాలనే సంచలనాత్మక సూచనలు ఆ కమిటి చేసిన తరుణంలో కేంద్రం ఆమోదముద్ర వేయవచ్చని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ తెలిపింది. అయితే కేంద్రం తీసుకోబోయే ఈ నిర్ణయం ఆహ్వానించదగినదంటూ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని ఇదివరకే తీసుకుని ఉంటే ఎందరో బాధితులకు మేలు చేకూరేదని అభిప్రాయం సైతం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రం ఆలస్యం చేయకుండా వీటి అమలు దిశగా కృషి చేయాలంటూ సామాజికవేత్తలు పిలుపునిస్తున్నారు.