దేశ వ్యాప్తంగా టౌన్ షిప్ లను ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ

SMTV Desk 2017-09-15 13:20:09   Indian, Japan, Prime Minister Modi

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15 : గాంధీ నగర్ లో భారత, జపాన్ పారిశ్రామికవేత్తల సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ, 21వ శతాబ్దం భారత్ దే కానుందన్నారు. ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు. జీఎస్టీ అమలు ద్వారా అతిపెద్ద పన్ను సంస్కరణకు శ్రీకారం చుట్టామన్న ప్రధాని, వివిధ రంగాల్లో భారత్ సాధించిన ప్రగతిని ప్రపంచ స్థాయి సంస్థలు కూడా గుర్తించాయన్నారు. భారత్ చేపట్టిన అనేక అభివృద్ధి పథకాలు జపాన్ తో ముడిపడి ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను అందిపుచ్చుకుని పెట్టుబడులతో ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని నాలుగు చోట్ల ఏర్పాటు చేస్తున్న జపాన్ పారిశ్రామిక టౌన్ షిప్ లను గురించి ప్రధాని ప్రస్తావిస్తూ.. మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని, పెట్టుబడిదారులకు ఇవి జీవితకాల అవకాశాలను కల్పిస్తాయన్నారు. వంద ఆకర్షణీయ నగరాలు, నివాస సౌకర్యం లేని 50 లక్షల మందికి ఇళ్లు కట్టించడం, రహదారులు, వంతెనలు, నౌకాశ్రయాలు, రైలు పట్టాలు, రైల్వే స్టేషన్ల నిర్మాణం వంటివి ఇందులోకి వస్తాయన్నారు. ఈ మేరకు భారత్ అందజేస్తున్న అవకాశాలతో జపాన్ పెద్ద ఎత్తున లాభపడుతుందన్నారు. దేశం అభివృద్ధి ఎజెండా జపాన్ కంపెనీలతో ముడిపడి ఉంది. దీంతో పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ లోకి తీసుకువచ్చే దిశగా దేశ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దేందుకు మేం చాలా కష్టపడుతున్నామంటూ, దేశవ్యాప్తంగా జపాన్ పారిశ్రామిక టౌన్ షిప్ ల అభివృద్ధికి నాలుగు ప్రదేశాలను గుర్తించారు. గుజరాత్ కాకుండా రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో వాటిని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.