6వ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌... జీడీపీ రేటు 11.72

SMTV Desk 2017-09-15 13:07:24  Andhrapradesh, AP GDP Rate, GDP Rate, Chandrababu Naidu

అమరావతి, సెప్టెంబర్ 15: నేడు ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ప్రభుత్వ శాఖాధిపతులు, కార్యదర్శుల సదస్సు లో మొదటగా త్రైమాసిక ప్రగతి-లక్ష్యాలపై చర్చ జరిగింది. ఈ నేపధ్యంలో ఏపీ సీఎస్‌ దినేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ... ఇప్పటికే సచివాలయంలో బయోమెట్రిక్‌ హాజరు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఇదే విధానాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అనుసరించి ప్రభుత్వ పథకాల్లో మరింత పారదర్శకత సాధించేందుకు కృషి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో మొదటి త్రైమాసిక వృద్ధి రేటు 11.72గా ఉందని, ఈ వృద్ధి జాతీయ స్థాయి కంటే రెట్టింపని వెల్లడించారు. కాగా, జాతీయ స్థాయిలో తొలి త్రైమాసిక వృద్ధిరేటు 5.6గా నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కోసం నరేగా పథక నిధులను ఉపయోగిస్తూ వృద్ధిని సాధిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గనిర్దేశాన్ని దినేశ్‌ కుమార్‌ కొనియాడారు. తలసరి ఆదాయంలో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ 6వ స్థానంలో ఉందని, అగ్రస్థానంలో హరియాణా కొనసాగుతోందని తెలిపారు. 2017-18 తొలి త్రైమాసికానికి మత్స్య రంగంలో 42.09, వ్యవసాయ రంగంలో 27.60, గనుల రంగంలో 15.25, తయారీ రంగంలో 15.23, వాణిజ్య రంగంలో 11.08, ఆర్థిక సేవల రంగంలో 9.54, రవాణా రంగంలో 9.04, సేవా రంగంలో 8.67, , ప్రజా పనుల్లో 8.16 పారిశ్రామిక రంగంలో 8.05, స్థిరాస్తి రంగంలో 6.37, నిర్మాణ రంగంలో 5.67, ఇతర రంగాల్లో 9.24 వృద్ధి రేటు సాధించినట్లు తెలియజేశారు..