తెలుగును తప్పించకండి.. తప్పనిసరి చేయండి

SMTV Desk 2017-09-13 15:47:44  telugu language, world telugu summit hyderabad, talangana schools telugu language

హైదరాబాద్ సెప్టెంబర్ 13: తెలుగుభాష మన అధికార భాష, కమ్మనైన తెలుగు భాషను కలలో కూడా మరువరాదు, అమ్మపాల కమ్మదనం తెలుగులో ఇమిడి ఉంది. ఘనమైన తెలుగుదనాన్ని రాబోయే తరాలకు గొప్ప ఘనచరిత్రగా మనం అందించాలి. శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో తెలుగు భాష ఎంత గొప్పగా వర్థిల్లిందో, ఆ కాలం నుండే మహా కవులు తెలుగులో పదాలు, కావ్యాలు రాయడం మొదలుపెట్టారు. తెలుగు భాష గురించి శ్రీకృష్ణ దేవరాయలు ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని కీర్తించడం జరిగింది. మరి అంతటి ప్రఖ్యాతి గాంచిన తెలుగు భాషకు ఇప్పుడు తెగులు పడుతోంది. మన మాతృ భాషను మనం కాపాడుకోవాలి. మాతృ భాష స్థానంలో ఆంగ్ల భాష ప్రాధాన్యాన్ని సంతరించుకుంటూ వస్తోంది. తత్ఫలితంగా మాతృ భాష మరుగున పడుతూ వస్తోంది. ఇప్పుడు మాతృ భాషను కాపాడుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఖచ్చితంగా తెలుగును ఒక పాఠ్యాంశంగా బోధించాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలుగును ఖచ్చితంగా బోధించే పాఠశాలలకు మాత్రమే తెలంగాణలో అనుమతి ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా ఆహ్వానించదగిందే. ఎందుకంటే.. ఇంటర్నేషనల్ స్కూల్స్ లో తెలుగు భాష లేకపోవడం వల్ల ఎంతో మంది తెలుగు విద్యార్థులకు తెలుగు భాషా ప్రాధాన్యం గురించి తెలియకుండా పోయింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పోరేట్ స్కూల్స్ లో చాలా స్కూళ్లలో తెలుగు భాషకు అంతగా ప్రాధాన్యం కల్పించడం లేదు. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్న ప్రతి విద్యార్ధి, తెలుగు భాషను నేర్చుకోవడమే కాక తెలుగు భాష ప్రాముఖ్యత ప్రతి విద్యార్థికి తెలుస్తుంది.