గంగానది తర్వాత అంతటి పవిత్రత ఆ నదికే : సచ్చిదానంద స్వామీజీ

SMTV Desk 2017-09-13 10:37:15  kaveri pushkaralu, sacchidhanandha swami, kaveri river,

బెంగళూరు సెప్టెంబర్ 13: కావేరి నది పుష్కరాలు ప్రారంభమైనాయి. ఈ పుష్కరాలు సెప్టెంబర్ 12 నుండి సెప్టెంబర్ 23 వరకు జరగనున్న నేపధ్యంలో మైసూరు అవధూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ కావేరీ పుష్కర స్నానంతో పునీతులు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం మండ్య జిల్లా శ్రీరంగపట్నంలోని రంగనాథస్వామి దేవాలయ ప్రాంగణంలోని.. జయలక్ష్మి కల్యాణమంటపం వద్ద వేదపండితుల మంత్రోచ్ఛారణ మధ్య పుష్కరాలకు శ్రీకారం చుట్టారు. అఖిల కర్ణాటక కమ్మవారి సంఘం నిర్వహణలో పుష్కర ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులనుద్దేశించి ప్రసంగించిన సచ్చిదానంద స్వామీజీ.. నదులు జీవజలాలని, వాటిని భావితరాల కోసం కాపాడేందుకు ప్రతిన పూనాలని పిలుపునిచ్చారు. గంగానది తర్వాత అంతటి పవిత్రమైనదిగా భావించే నది కావేరి. అందుకే కావేరిని దక్షిణ గంగ అని పిలుస్తారు. దేవగురువైన బృహస్పతి తులారాశిలో ప్రవేశించడంతో కావేరీనదికి పుష్కరాలు ప్రారంభం అవుతాయి. బృహస్పతి ఈ సెప్టెంబర్‌ 12న కన్యారాశి నుంచి తులారాశిలో కాలు పెడుతున్నాడు. 23 వరకు అక్కడే ఉంటాడు కాబట్టి ఈ 12 రోజులూ ఆ నది పుష్కర శోభను సంతరించుకుంటుంది. నర్మదా నదీతీరంలో తపస్సు, కురుక్షేత్రంలో దానం, కాశీక్షేత్రంలో మరణించడం వల్ల కలిగే ఫలం కేవలం పుష్కర స్నానం వల్ల కలుగుతుందని పురాణోక్తి. రాష్ట్రంనుంచే కాకుండా తమిళనాడు, ఏపీ, తెలంగాణ నుంచి పెద్దసంఖ్యలో భక్తులు పుష్కరాలకు తరలివచ్చారు. ప్రభుత్వ ప్రత్యేక ఏర్పాట్లు లేకున్నా, స్వచ్ఛంద సంస్థలు భోజన సదుపాయాలు కల్పించాయి. కావేరీ నది ప్రవహించే అన్ని పుణ్యక్షేత్రాల్లో భక్తుల తాకిడి కనిపించింది.