కరెంట్ కావాలంటే రీచార్జ్ చేయాల్సిందే!!!

SMTV Desk 2017-09-12 17:37:19  Power, Prepaid meters,

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12 : ఇకపై విద్యుత్ బకాయిలకు అడ్డుకట్ట వేసేందుకు సంస్థ ప్రీపేయిడ్ మీటర్లు బిగించనుంది. పట్టణ ప్రాంతాల్లో ప్రతినెలా విద్యుత్ సంస్థ తమ సిబ్బందితో ప్రతి మీటరు వద్ద బిల్లింగ్ పరికరంతో వినియోగదారుడి బిల్లును ఇంటి వద్దే అందజేస్తుంది. అదేవిధంగా గ్రామాల్లో ప్రతి రెండు నెలలకొసారి బిల్లును ఇస్తుంది. ఈ విధంగా బిల్లును వినియోగదారునికి అందించిన తర్వాత పట్టణ ప్రాంతాల్లో గృహ వినియోగదారులు స్థానికంగా ఉండే బిల్లు స్వీకరణ కేంద్రాల్లో బిల్లులను చెల్లిస్తారు. కానీ గ్రామాల్లో మాత్రం విద్యుత్ శాఖ సిబ్బంది నేరుగా వెళ్లి వసూలు క్యాంపులను పెట్టి వసూలు చేస్తారు. ఈ విధానం వల్ల బిల్లు స్వీకరణకు, బిల్లు వివరాలు అందించడానికి ఎక్కువ మొత్తంలో సమయం వృథాతో పాటు బ్రేక్‌డౌన్ ఆపరేషన్లలో సిబ్బందికి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలను అరికట్టడానికి విద్యుత్ శాఖ కొత్త పద్ధతిని ప్రవేశపెడుతుంది. తమ సిబ్బంది పూర్తిస్థాయిలో ఫీల్డు మీదనే ఏకాగ్రత పెట్టేలా ముందస్తు బిల్లు చెల్లింపుల పద్ధతిని ప్రవేశపెడుతుంది. విద్యుత్ దుబారాను అరికట్టేందుకు ప్రీపెయిడ్ మీటర్లను అందుబాటులోకి తెస్తున్నారు. సెల్‌ఫోన్ మాదిరిగానే ముందస్తు కరెంట్ రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రస్తుతం ఉన్న మీటర్ల స్థానంలో ప్రీపెయిడ్ మీటర్లను బిగించనున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో నెలసరి విద్యుత్ వినియోగంను బట్టి విద్యుత్ రీచార్జ్ కార్డులను విక్రయించనున్నారు. రీచార్జి చేసిన మొత్తం మేరకే విద్యుత్ వాడుకోవాల్సి ఉంటుంది. రీచార్జీ మొత్తం అయిపోతే ఆటోమేటిక్‌గా విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. తిరిగి రీచార్జ్ చేసుకుంటే మళ్లీ కరెంట్ సరఫరా అవుతుంది. ఈ మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా ప్రీపెయిడ్ మీటర్లను అమర్చాలని విద్యుత్ పంపిణీ సంస్థలు నిర్ణయించాయి.