తిరుపతి వెంకన్న సాక్షిగా మోదీ ఇచ్చిన వాగ్దానం ఏమైంది?

SMTV Desk 2017-06-05 13:41:28  Thiupati,UPA,Andhrapradesh,Rahulgandhi,AICC

అమరావతి, జూన్ 5 : 2019 ఎన్నికల్లో యూపీఎ(యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియన్స్) అధికారంలోకి వస్తుందని, ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించే ఫైల్ పై తొలి సంతకం చేస్తామని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విభజించినప్పుడే అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేక హోదా ఇస్తామని, పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆ హామీని వాయిదా వేస్తున్నదని విమర్శించారు. గుంటూరులో ఆదివారం జరిగిన ప్రత్యేక హోదా భరోసా సభలో రాహుల్ మాట్లాడారు. ప్రధాని మోడీ అంటే ఏపి సీఎం చంద్రబాబుకు, ప్రతిపక్ష నేత జగన్ కు భయమని, అందుకే హోదాపై ప్రశించడం లేదన్నారు. నిత్యం హిందూ ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడే ప్రధాని, గత ఎన్నికల సమయంలో తిరుపతి వెంకన్న సాక్షిగా ఏపీకి పది సంవత్సరాల వరకు హోదా ఇస్తానని మాట ఇచ్చి, అధికారంలోకి రాగానే దానిని వదిలేసి, ఏపీ ప్రజలను మోసం చేసారని రాహుల్ ధ్వజమెత్తారు. ఎక్కడో ఉన్న ఇతర పార్టీ నేతలు ప్రత్యేక హోదా కావాలని ప్రశ్నిస్తుంటే, ఏపీలోని పార్టీల నేతలు ఎందుకు రాలేదని నిలదీశారు. ప్రత్యేక హోదా అనేది బహుమతి కాదని, ఏపీ ప్రజల హక్కు అని పేర్కొన్నారు. హోదా కోసం ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు పోరాటం చేయకపోయినప్పటికీ, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వెన్నుదన్నుగా ఉంటుందన్నారు. ఏపీ సమగ్ర అభివృద్ధికి హోదా చాలా అవసరమన్నారు. హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం నుంచి 90 శాతం నిధులు అందుతాయని, యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఇప్పటి వరకు లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. దేశంలో స్వచ్చభారత్ కోసం ప్రధాని పిలుపు ఇచ్చినప్పటికీ, అది ఎక్కడా అమలు కావడం లేదని అన్నారు. ఎక్కడ చూసిన దుర్గందమే వస్తుందని దుయ్యబట్టారు. మొదట స్వచ్చభారత్, ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అంటూ ప్రజల్ని నమ్మిస్తున్నారని ఆరోపించారు. పోలవరానికి జాతీయ హోదాను కూడా కాంగ్రెస్ పార్టీయే ఇచ్చిందన్నారు.