ఉత్తమ సాహస పర్యాటక భారతీయ రాష్ట్రం

SMTV Desk 2017-09-12 15:23:08  Andhrapradesh, Tourist spots, Adventure Tourist place, Top Tourist Places

అమరావతి, సెప్టెంబర్ 11: ఏపీ పర్యాటకశాఖకు మరో అరుదైన కీర్తి సొంతమైంది. ప్రతిష్టాత్మక ఎడ్వంచర్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ఉత్తమ సాహస పర్యాటక భారతీయ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను ప్రకటించింది. సాహస క్రీడలు, సాహసోపేతమైన ప్రయాణం వంటి రంగాలను మరింత ముందుకు తీసుకువెళ్తున్నందుకు రాష్ట్రానికి ఈ గౌరవం లభించినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సగటున ప్రతినెలా ఒక అవార్డును పర్యాటకశాఖ సొంతం చేసుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలియజేసారు. ఈనెల 19వ తేదీన కేరళ వేదికగా జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో ఎపిటిడిసి ఎండి హిమాన్షు శుక్లా ఈ అవార్డును అందుకుంటారని మీనా తెలిపారు. ఇదిలా ఉండగా ఈవెంట్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ మానేజ్‌మెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించిన అవార్డుల్లో రెండింటిని ఆంధ్రప్రదేశ్ టూరిజం దక్కించుకుందని అన్నారు. ప్రభుత్వపరమైన ఈవెంట్లకు సంబంధించిన విభాగంలో 48 ఎంట్రీలు రాగా, తొలి రెండు స్థానాల కోసం మనకై మనమే పోటీపడినట్టు అయిందన్నారు. గోల్డెన్ ఈవెంట్‌గా 2017 ఫిబ్రవరిలో నిర్వహించిన విశాఖ ఫెస్టివల్, సిల్వర్ ఈవెంట్‌గా అమరావతి మ్యూజిక్ ఫెస్టివల్ రికార్డులకు ఎక్కాయి. ఇది సాధారణ విషయం కాదని ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న ఒక నూతన రాష్ట్రం జాతీయ స్థాయిలో వరుసగా తొలి రెండు స్థానాలను దక్కించుకోవటం ప్రభుత్వ సత్తాను బహిర్గతం చేస్తుందన్నారు.