అత్యాచారం చేసి, ఆపై వీడియోని పోర్న్ సైట్ లో అప్ లోడ్ చేశారు

SMTV Desk 2017-09-12 14:28:38  Rape, Software Employee, Senior Software Engineer, Bengaluru

బెంగుళూరు, సెప్టెంబర్ 12: విధుల నిర్వహణలో ఆదర్శప్రాయం గా నిలవాల్సిన సీనియర్ ఉద్యోగి కర్కశత్వం... అమానుషం, బెంగుళూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆరిందమ్ నాథ్ (28) సీనియర్ సాప్ట్‌ వేర్ ఇంజనీరుగా బెంగళూరులో పనిచేస్తున్నాడు. ఈజిపురా ప్రాంతంలోని వివేక్ నగర్ ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నాడు. ఒడిశాకు చెందిన యువతి (26) కూడా అతను పని చేసే కంపెనీలో పని చేస్తోంది. సీనియర్ ఉద్యోగి అయిన ఆరిందమ్, ఆమెను ప్రేమిస్తున్నానని కబుర్లు చెప్పి తన ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసి, ఆ తతంగాన్ని తన సెల్ ఫోన్ తో రహస్యంగా చిత్రీకరించాడు. ఆ వీడియోని పోర్న్ సైట్ లో పెడతానని బెదిరిస్తూ, తన ఫ్లాట్‌కు పలు మార్లు రప్పించుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం డబ్బు కూడా ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు. దీనికి ఆ యువతి నిరాకరించడంతో ఆ వీడియోను పోర్న్ సైట్‌లో అప్ లోడ్ చేశాడు. ఈ విషాద ఘటనపై బాధితురాలు తన స్నేహితురాళ్లతో కలిసి ఆరిందమ్ నాథ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆరిందమ్ పై పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, 384, 506, 66 చట్టాల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. విచారణలో ఆరిందమ్ నేరాన్ని అంగీకరించాడు. పోర్న్ సైట్ నుండి ఆ వీడియోని క్రైం పోలీసులు తొలగించారు. ఈ అవమానంతో బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేయగా, ఆమెను స్నేహితురాళ్లు కాపాడి ఆసుపత్రికి తరలించారు.