ఉత్తర కొరియాతో మిత్ర దేశానికి సైతం తప్పని తిప్పలు

SMTV Desk 2017-09-12 11:59:40  Hydrogen Bomb, Missile tests, North Korea, China

వాషింగ్‌టన్, సెప్టెంబర్ 12: అగ్ర దేశం అమెరికాపై ఉత్తరకొరియా అవలంబిస్తున్న వికృత చేష్టలు చైనాకు,పెను సంక్షోభంగా పరిణమిస్తున్నాయి. శత్రు దేశమైన అమెరికాను భయపెట్టే యోచనలో నార్త్ కొరియా ఇంతవరకు పలు క్షిపణి ప్రయోగాలు చేపట్టిన విషయం విదితమే. తాజాగా ఉత్తరకొరియా పుంగెరి కొండల్లోని సొరంగంలో హైడ్రోజన్‌ బాంబు పరీక్షించింది. దీని కారణంగా సొరంగం కూలిపోవడమే కాకుండా పేలుడులో వెలువడిన రేడియోధార్మిక వ్యర్థాలు వాతావరణంలో కలుస్తున్నాయి. దీంతో కొరియాకు ఉన్న, ఏకైక మిత్ర దేశం చైనా తీవ్ర ఆందోళన బాట పట్టింది. ఈ వ్యర్థాలు చైనా వైపు రావడం ఖాయమని వారు వాపోతున్నారు. ఈ ప్రాంతంలో ఉత్తరకొరియా మరొక్క అణుపరీక్ష నిర్వహిస్తే, ఉత్తరకొరియాతో పాటు చైనాలో కూడా అంతుబట్టని వ్యాధులతో ప్రజలు మరణించే ప్రమాదం ఉందని అమెరికాకు చెందిన రాన్డ్ కార్పొరేషన్ అనే రక్షణ వ్యవహారాల విశ్లేషణా సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. కయ్యానికి కాలుదువ్వుతున్న నార్త్ కొరియా మరోసారి అణు పరీక్ష నిర్వహించదనే గ్యారెంటీ లేదని వారు వెల్లడించారు. ఇదే విషయంపై స్పందించిన చైనా శాస్త్రవేత్తలు కూడా అదేప్రాంతంలో మరోసారి పేలుడు జరిగితే ఉత్తరకొరియాతో పాటు చైనాకు కూడా ముప్పుతప్పదని తేటతెల్లం చేశారు. కాగా, ఉత్తర కొరియాకు చైనా ఆర్థిక సాయం చేస్తుందన్న వార్త బహిరంగ రహస్యమే. ఈ నేపధ్యంలో ఉత్తర కొరియా చేష్టలపై మిత్ర దేశం చైనా ఏలా స్పందిస్తుందో వేచి చూడాలి.