సొంత పత్రికా, ఛానెల్ పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ గట్టెక్కుతుందా..?

SMTV Desk 2017-09-12 11:18:56  congress, congress party, congress new news paper, congress news paper, congress news channel

హైదరాబాద్ సెప్టెంబర్ 12: పాత తరం రాజకీయ నాయకులకు కొత్త తరం రాజకీయ నాయకులకు చాలా తేడా ఉంది. పాత తరం రాజకీయ నాయకులు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తే, కొత్త తరం నాయకులు మాత్రం పరిస్థితులకు అనుగుణంగా ప్రజల ఆలోచనా విధానాల్లో వస్తున్న మార్పులను బట్టి పాలన సాగిస్తున్నారు. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ సంఘటన. నేటి కొత్త తరం రాజకీయ నాయకుల్లో ప్రతి పార్టీ తనకు సొంతంగా ఒక పత్రికను, ఛానెల్ ను పెట్టుకోవడం, వారు చేస్తున్న కార్యక్రమాలను అందులో ప్రసారం చేయడం, వారి పార్టీ నాయకులకు సంబంధించిన సమాచారాన్ని ప్రసారం చేయడం ఇలా ప్రజల్లో క్రేజ్ సంపాదించడం లాంటివి సభ్య సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని పార్టీలకు సొంత ఛానెల్, పత్రిక ఉన్నాయి. అయితే ఇందులో ప్రధానంగా తీసుకోవాల్సిన విషయం టీఆర్ఎస్ పార్టీని. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమ సమయంలో తన సొంత న్యూస్ ఛానెల్, పేపర్ ద్వారా ఆ పార్టీకి చెందిన ఆయా నాయకులు చేసిన ఉద్యమాన్ని, దానికి ప్రజల నుండి వచ్చిన స్పందనను, దానితో పార్టీకి ప్రజల్లో పెరిగిన ఆదరణ, ఫలితంగా పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోవడం ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు హస్తం పార్టీ కూడా సొంత పత్రిక, ఛానెల్ ప్రారంభించబోతున్నట్టు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అయితే ఇప్పటికే పాలనలో బాగా పాతుకుపోయిన టీఆర్ఎస్ పార్టీ ని గద్దెను దింపడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదనకు ఉత్తమ్ పూనుకున్నట్టు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేయడం, ఫలితంగా ప్రజల్లో వ్యతిరేక భావన కలిగించేలా చేయడం, రాబోయే ఎన్నికల్లో సాధ్యమైనన్ని స్థానాలను సాధించుకోవడం లాంటివి పార్టీ లక్ష్యాలుగా చేసుకొందని, అందులో భాగంగానే ఈ కొత్త ఛానెల్, పత్రికా నిర్ణయానికి వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం పార్టీని సంక్షోభం నుండి గట్టెక్కిస్తుందో లేదో చూడాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.