సెల్ఫీ దిగి పంపితే...స్మార్ట్‌ఫోన్‌ గిఫ్ట్

SMTV Desk 2017-09-11 18:30:59  jharkhand, government of jharkhand, mnc,

ఝార్ఖండ్, సెప్టెంబర్ 11: ప్రస్తుతం యువతపై సెల్ఫీల ప్రభావం చాలా ఉండటంతో... ఝార్ఖండ్‌ ప్రభుత్వం స్వచ్ఛభారత్‌ ప్రచారంలో భాగంగా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ఓ వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియ లో భాగంగా రాష్ట్రంలోని ప్రజలు ఓ డస్ట్‌బిన్‌తో సెల్ఫీ దిగి పంపితే చాలు, వారికి స్మార్ట్‌ఫోన్‌ బహూకరిస్తామని ప్రకటించింది. ఈ పోటీలో పాల్గొనడానికి ప్రజలు డస్ట్‌బిన్‌తో సెల్ఫీ దిగి ఎంఎన్‌ఏసీ ఫేస్‌బుక్‌ పేజ్‌కు పంపాలి. ఈ ఫొటోలు పంపడానికి సెప్టెంబర్‌ 30వరకు మాత్రమే గడువు ఉంది. ప్రభుత్వం చేపట్టిన సరికొత్త కార్యక్రమం వల్ల ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా ప్రతి ఇంట్లో డస్ట్‌బిన్‌ ఉండేలా చేస్తుందని ఎంఎన్‌ఏసీ(మ్యాంగో నోటిఫైడ్‌ ఏరియా కమిటీ) అనే ప్రభుత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని లక్కీడ్రాలో గెలిచిన ముగ్గురికి కమిటీ స్మార్ట్‌ఫోన్‌ అందజేస్తుంది. అంతేకాదు.. మొదటి 50 సెల్ఫీలు పంపినవారికి ప్రభుత్వం తరఫున ధ్రువపత్రాలు ఇస్తారు. "స్వచ్ఛభారత్‌ అంటూ నగరాన్ని పరిశుభ్రంగా చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని" ఎంఎన్‌ఏసీ ప్రత్యేక అధికారి సంజయ్‌ కుమార్‌ తెలిపారు.