కలకలం రేపుతున్న గురుకులం వన్యప్రాణుల మాంస విక్రయాలు..!!

SMTV Desk 2017-09-11 17:59:42  Social welfare school, Hunting of wildlife animals, karnool

కర్నూల్, సెప్టెంబర్ 11 : ఓ గురుకుల పాఠశాలలో జరుగుతున్న మోసం బయటపడింది. రాత్రి పూట విద్యార్థులను తీసుకెళ్ళి వన్య ప్రాణులను వేటాడుతున్నారనే వార్తలు రావడం కలకలం రేపుతోంది. పూర్తి వివరాలలోకి వెళితే.. కర్నూల్ జిల్లా ఆలూరు మండలం అరికెల గురుకుల పాఠశాలలోని విద్యార్థులను, వంట మాస్టర్, మరో నలుగురు వ్యక్తులు రాత్రి సమయాల్లో తీసుకెళ్ళి జింకలు, నెమళ్ళు, కుందేళ్ళను వేటాడుతున్నట్లు సమాచారం అందింది. అలా వేటాడిన ఆ మాంసాన్ని అదే పాఠశాల వేదికగా కిలో రూ. 950 కి అమ్ముతున్నట్లు తెలిసింది. అంతేకాకుండా తమతో వచ్చినందుకు గాను ఆ విద్యార్థులకు కొంత డబ్బు కూడా ఇస్తున్నారని తెలిసి, కొంతమంది ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా పోలీసులు కొన్ని కుందేళ్ళ, నెమలి ఈకలు గుర్తించారు. పాఠశాలలో ఇలాంటి చట్ట వ్యతిరేక పనులు జరుగుతుండడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.