జాతీయ పెన్షన్ పథకం గరిష్ట వయోపరిమితి పెంపు..!

SMTV Desk 2017-09-11 16:04:40  pension age limit, pfrda chairman hemanth, National Pension Scheme.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11 : జాతీయ పెన్షన్ పథకం(ఎన్‌పీఎస్‌) గరిష్ట వయోపరిమితిని 60 ఏళ్ళ నుంచి 65 ఏళ్ళకు పెంచుతున్నట్లు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటి ప్రకటించింది. ఇదివరకు ఎన్‌పీఎస్ పథకం 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు వయోపరిమితి 5 ఏళ్ళ వరకు సడలిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల చాలా మందికి లాభం కలిగే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయానికి అందరూ అంగీకరించినట్లు పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ హేమంత్ కాంట్రాక్టర్ వెల్లడించారు. వినియోగదారులకు అన్ని రకాల సౌకర్యాలతో పాటు, కాలం చెల్లిన నిధులను సక్రమంగా వినియోగించడంలో పీఎఫ్ఆర్డీఏ కృషి చేస్తోంద‌ని ఆయన తెలిపారు. అంతేకాకుండా అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న 85 శాతం మంది ఉద్యోగులకు కూడా పెన్షన్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు హేమంత్ పేర్కొన్నారు.