రాష్ట్ర వాతావరణంలో అనుకోని మార్పులు

SMTV Desk 2017-09-11 15:27:29  Weather Update, Hyderabad Weather, Southwest Monsoon, Temperature

హైదరాబాద్‌, సెప్టెంబర్ 11: నైరుతి రుతుపవనాలు దిశ మార్చుకొని హిమాలయాల వైపు వెళ్లడంతో రాష్ట్ర వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. దీని కారణంగా రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశాలు లేవని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సంచాలకుడు వై.కె.రెడ్డి ప్రకటించారు. అయితే అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లుల నుంచి ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపిన ఆయన ప్రస్తుతం మధ్య మహారాష్ట్ర నుంచి కర్ణాటక వరకు భూతల ద్రోణి సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఆవరించి ఉందని పేర్కొన్నారు. కాగా, తూర్పు భారతం నుంచి పశ్చిమ భారతం వైపు రుతుపవనాల గాలుల్లోని తేమ ఆకాశం దిశగా వెళ్లే ద్రోణి ఏర్పడింది. దీనివల్ల పొడి వాతావరణం మరింత పెరుగుతోంది. . మహబూబ్‌నగర్‌, మెదక్‌లో అత్యధికంగా పగటి ఉష్ణోగ్రత 35 డిగ్రీలకు చేరింది. ఇది సాధారణం కంటే 4 డిగ్రీలు ఎక్కువ. హైదరాబాద్‌లో 3 డిగ్రీలెక్కువగా నమోదైంది. రాత్రి పూట రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా హైదరాబాద్‌లో సాధారణంకన్నా 3 డిగ్రీలు పెరిగింది. నగరంలో సాధారణంగా గాలిలో తేమ 81 శాతముండాలి. కానీ ఇప్పుడు 69 శాతానికి పడిపోవడంతో ఉక్కపోత పెరిగింది. ఇదే పరిస్థితి ఈ నెల 15వరకు కొనసాగనున్నట్లు సమాచారం. ఈ మార్పుల కారణంగా మళ్లీ రైతులకు కరెంటు బోరులే శరణ్యంగా మారాయి, దీంతో కరెంటు వినియోగం అధికమైంది.