సీఆర్పీఎఫ్ సైనికలను ప్రశంసించిన కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్

SMTV Desk 2017-09-11 15:20:44  CRPF, Jammu Kashmir, Union Home Minister Rajnath Singh, Central paramilitary

శ్రీనగర్, సెప్టెంబర్ 11 : జమ్ము కశ్మీర్ లో విధులు నిర్వహించే సీఆర్పీఎఫ్ సిబ్బందికి మరింత సౌలభ్యం గా ఉండేందుకు హెలికాప్టర్ల ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. నాలుగు రోజుల జమ్ము కశ్మీర్ పర్యటనలో భాగంగా అనంతనాగ్ లో సీఆర్పీఎఫ్ సైనిక సమ్మేళనంలో రాజ్ నాథ్ పాల్గొన్నారు. విధి నిర్వహణలో చనిపోయిన కేంద్ర పారా మిలటరీ దళాలకు చెందిన కుటుంబ సభ్యులకు ఆర్థికపరమైన ప్రయోజనాలను మరింత పెంచే పనిలో ఉన్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో పారా మిలటరీ సిబ్బంది అమరులైతే, వారి కుటుంబానికి అందజేసే పరిహారం మొత్తం ప్రస్తుతం 60 నుంచి 70 లక్షలు ఉంది. ఆ మొత్తాన్ని కోటి రూపాయలుగా పెంచుతామని రాజ్ నాథ్ వివరించారు. అమరుల కుటుంబాలను ఆదుకునేందుకు భారత్ ఎక్ వీర్ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.