అమెరికాను చుట్టుముట్టిన ప్రకృతి విపత్తులకు కారణం ఇదేనా?

SMTV Desk 2017-09-11 14:14:12  USA Hurricane, Irma, Weather, Jose

హైదరాబాద్, సెప్టెంబర్ 11: అభివృధ్దే ధ్యేయంగా దూసుకుపోతున్న ప్రపంచ దేశాల్లో ఎందుకు పెను విపత్తులు సంభవిస్తున్నాయి. ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికాను ఎందుకు వరుస ప్రళయాలు చుట్టుముట్టుతున్నాయి? పారిశ్రామీకరణే అంతటి విపత్తులకు కారణమా? లేక సహజ సిద్ధంగానే ప్రకృతి ప్రళయరూపం దాల్చిందా? ఈ విపత్తులు ఇలానే కొనసాగితే అమెరికా పరిస్థితి ఏమిటి? అభివృద్ధినే టార్గెట్ గా భావిస్తున్న ఆ దేశాలు ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయా? అవుననే అంటున్నారు వాతావరణ నిపుణులు. ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా నిలవాలన్న ఉత్సుకతతో ఈ వికృత పారిశ్రామికీకరణకు పూనుకుంటున్నారని, అభివృద్ధి మంత్రంలో కూరుకుపోయి వాతవరణ పరిస్థితులు పెడ చెవిన పెడుతున్నారని, పచ్చదనం అనే మాటనే ప్రపంచం మరిచిపోయిందని, కార్బన్‌ ఉద్గారాలు పరిమితికి మించి వెలువరించే పోకడను అనుకరించడమే విపత్తులకు కారణాలుగా భావిస్తున్నారు. ఉష్ణమ౦డల తుఫానులు పయని౦చే సాధారణ మార్గాన్ని పరిశీలి౦చినట్లయితే అవి సాధారణ౦గా భూమధ్యరేఖ ను౦డి దూర౦గా అటు ఉత్తర౦గానో ఇటు దక్షిణ౦గానో శీతల ప్రా౦తాల దిశగా పయనిస్తాయి. అలా పయని౦చడ౦లో, తుఫానులు ఉష్ణ వినిమయకాలుగా కూడా పనిచేస్తూ వాతావరణ తీవ్రతను తగ్గి౦చడ౦లో సహాయ౦ చేస్తాయి. అయితే మహాసముద్ర౦లోని ఉపరితల భాగ౦లో ఉష్ణోగ్రత దాదాపు 27 డిగ్రీల సెల్సియస్‌లకన్నా ఎక్కువైతే ఉష్ణమ౦డల తుఫానులు సైక్లోన్‌లుగా, హరికేన్‌లుగా, టైఫూన్‌లుగా మారి ప్రళయ భీకరాన్ని సృష్టిస్తాయి. ఈ అంశాలనే అమెరికా వరుస విపత్తులకు ప్రధాన కారణాలుగా వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు మేల్కొనకపోతే మరిన్ని వైపరిత్యాలు సంభవించవచ్చని వారు హెచ్చరిస్తున్నారు.