నయవంచకులొస్తున్నారు జాగ్రత్త

SMTV Desk 2017-06-05 11:32:42  apcm, navanirmana dhiksha, vijaywada,

విజయవాడ, జూన్ 5 : కల్లబొల్లి మాటలతో జనాన్ని నమ్మించేందుకు నయవంచకులోస్తున్నారని..వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని..వారికి ఏమాత్రం సానుభూతి చూపవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు వెల్లడించారు. విజయవాడలో నిర్వహిస్తున్న నవనిర్మాణ దీక్షలో భాగంగా మూడో రోజు వ్యవసాయం-అనుబంధరంగాలు- జల సంరక్షణ- సుస్థిర అభివృద్ధి వ్యూహం అనే అంశంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు రాజకీయ పక్షాల శైలిని దుయ్యబట్టారు. విభజనతో రాష్ట్రానికి అన్యాయం చేసి మళ్లీ మన దగ్గరకు వచ్చి మెుసలి కన్నీరు కార్చే దేశ ద్రోహుల పట్ల సానుభూతి ఏమాత్రం చూపవద్దని..అలాగని విద్వేషాలు పెంచుకున్నాలాభం లేదని చెప్పారు. బ్రహ్మాండంగా ఎదుగుదాం, వాళ్ళంతా అసూయతో కుమిలి కుమిలి బాధపడే విధంగా ముందుకు సాగుదాం అంటు ఆయన పిలుపు నిచ్చారు. ఆ రోజు అధికారం, రాజకీయం కోసం మన పొట్టకొట్టారు. ఇప్పుడు మళ్లీ వచ్చి కల్లబొల్లి మాటలతో నయవంచన చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు గుంటూరులో మాట్లాడే చాలా మంది నాయకుల్ని తాను రాష్ట్ర విభజన సమయంలో కలిసి న్యాయంగా విభజన చేయమని కోరానని చెప్పారు. సీపీఎం, సీపీఐ, జనతాదళ్, డీఎంకే, ఏఐడీఎంకే తదితర పార్టీల నేతలందర్ని కోరినా పెడచెవిన పెట్టారన్నారు. రాజ్యసభకు వెళ్లినప్పుడు వెంకయ్యనాయుడు, భాజపా నాయకులు అడిగిన మీదటే ప్రత్యేక హోదా అంశం తెచ్చారన్నారు. అలాంటి నాయకులు ఇప్పుడొచ్చి ప్రేమ ఒలకబోస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కుట్రరాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామిగా ఉందని ఆరోపించారు. అన్యాయం చేసిన వాళ్లు సిగ్గు పడేలా నవనిర్మాణం చేస్తామని ప్రతిఒక్కరు ప్రతిజ్ఞ చేయాలని కోరారు. 2018 నాటికి పోలవరం నుండి గ్రావిటీ ద్వారా నీరు తీసుకువస్తాం..ఆగస్టు 15 నాటికి పురుషోత్తపట్నం పూర్తిచేస్తాం... కాంగ్రెస్ హయంలో పోలీస్ స్టేషన్లలో ఎరువులు పెట్టి పంపిణీ చేశారు. రైతుల్ని లాఠీలతో కొట్టించారు. ఇప్పుడు ఎరువులు, విత్తనాల కొరతలేదు, నీటి సమస్యపరిష్కరిస్తున్నాం, కరువుతో పంటలు నష్టపోయిన రైతులకు 1680 కోట్ల పెట్టుబడి రాయితీ చెల్లిస్తున్నామని వివరించారు. హుద్ హుద్ తుఫాన్ సమయంలో విశాఖపట్నం కళావిహీనంగా తయారైనా విపత్తును సమర్థంగా ఎదుర్కొని తిరుగులేని శక్తి గా నిరూపించుకున్నాం..ఫలితంగానే స్వచ్ఛ నగరాల్లో విశాఖకు దేశంలో మూడో స్థానం లభించిందని చెప్పారు.రైల్వే స్టేషన్ మెుదటి స్థానంలో నిలిచిందని వివరించారు. ఎంపిక చేసిన ప్రభుత్వాసుపత్రుల్లో ఎవరైనా చనిపోతే శవాలను తరలించేందుకు మహాప్రస్థానం వాహనాలు పదిరోజుల్లో అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. దహన ఖర్చులకు 30 వేలు అందిస్తామని వివరించారు. అవినీతి ఎవరు చేసినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.