మీ ధైర్య సాహసాలను కొనియాడేందుకు మాటలు రావడం లేదు: కశ్మీర్ పర్యటనలో హోం మంత్రి

SMTV Desk 2017-09-10 18:27:23  Home Minister, Rajnath Singh, Kashmir Police, Bulletproof Vehicles, Prime Minister

శ్రీనగర్, సెప్టెంబర్ 10: జమ్ము కశ్మీర్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేడు అనంత్‌నాగ్‌లో పర్యటించారు. ఉగ్రదాడిలో అమరులైన ఏఎస్‌ఐ అబ్దుల్‌ రషీద్‌, కానిస్టేబుల్‌ ఇంతియాజ్‌కు హోం మంత్రి నివాళులర్పించారు. పోలీసు సిబ్బంది కోసం ట్రామా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిధులను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. జమ్ము కశ్మీర్‌లోని పోలీసుల రక్షణ కోసం త్వరలో బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ తరుణంలో మాట్లాడిన రాజ్‌నాథ్‌ ‘కశ్మీర్‌ కోసం వారు ప్రాణ త్యాగం చేశారు. పోలీస్‌ సిబ్బందిని చూస్తుంటే గర్వంగా ఉంది. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో కూడా మీరు మీ విధులను నిర్వర్తిస్తున్నారు. మీ ధైర్య సాహసాలను కొనియాడేందుకు మాటలు రావడం లేదు. ప్రధాని నరేంద్రమోదీ కూడా మీ ధైర్యాన్ని ప్రశంసించారు’ అని అన్నారు. కాగా, అక్కడి భద్రతా దళాలతో జరిగిన సమీక్షా సమావేశం లో హోం మంత్రి పాల్గొన్నారు.