ప్రభుత్వ ఉపాధ్యాయులే తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్నారు..ఎందుకీ దుస్థితి..?

SMTV Desk 2017-09-09 13:43:19  praivet schools, government school, telangana school, govt schools position in telangana

హైదరాబాద్ సెప్టెంబర్ 9: తండ్రి ప్రభుత్వ స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తుంటే.. అతని కొడుకేమో కార్పోరేట్ స్కూల్లో చదువుతున్నాడు. ఇదే విషయం పై ఆ ఉపాధ్యాయుడిని ప్రశ్నిస్తే.. ఏమని సమాధానం వస్తుందంటే.. అవును గవర్నమెంట్ స్కూల్లో చదువులో నాణ్యత, వసతి, సౌకర్యాలు సరిగా ఉండవు గనకే నా కొడుకుని ప్రైవేట్ స్కూల్లో చవిస్తున్నానని సమాధానం చెబుతాడు. అయితే మనం ఇక్కడ ఈ విషయాలను పరిగణలోకి తీసుకుంటే లోపం ప్రభుత్వానిదా..? లేదా ఉపాధ్యాయులదా..? అని ప్రశ్నించుకుంటే సమాధానం మాత్రం ఇద్దరిదనే వస్తుంది. కారణం గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా నిర్మాణం కాకపోవడమే. పాడుబడ్డ బంగళాలు, పెచ్చులూడే పైకప్పులు, వర్షం పడితే చాలు నీటితో నిండిపోయే పరిస్థితి. స్కూలు మొత్తానికి ఒకే ఉపాధ్యాయుడు ఉండడం, ఎక్కువ మంది ఉన్నా లాంగ్ లీవ్ లపై వెళ్లి తమ ప్రైవేట్ కార్యక్రమాలు చూసుకోవడం, బోధనపై నిర్లక్ష్యం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాలతో విద్య వ్యవస్థ సతమతమవుతూ ఉంది. ఇవన్నీ ప్రభుత్వ విద్య వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కార మార్గం ఒక్కటే. ప్రభుత్వం తో పాటు, ఉపాధ్యాయుల్లో కూడా మార్పులు రావలసిన అవసరాన్ని ఈ వ్యాసం నొక్కి చెబుతుంది. ప్రభుత్వం బడ్జెట్ లో అత్యధిక నిధులను కేటాయించి, స్కూళ్ళను సకల సౌకర్యాలతో కార్పోరేట్ స్కూళ్ళకు ధీటుగా నిర్మించాలి. ఉపాధ్యాయులేమో తమ వృత్తికి న్యాయం చేస్తూ.. తమ పిల్లల్ని సైతం ప్రభుత్వ స్కూల్స్ లోనే చదివేలా చొరవ తీసుకోవాలి. ప్రభుత్వం, ఉపాధ్యాయులు ఈ రెండింటిలో మార్పు ఆవశ్యకం..!