మోదీ ప్రసంగానికి అనుమతి ఇవ్వని బెంగాల్ ప్రభుత్వం

SMTV Desk 2017-09-09 12:23:08  Indian Prime Minister Narendra Modi, West Bengal chief minister , State Education Minister Partha Chatterjee, Chicago

కోల్ కత్తా, సెప్టెంబర్ 09 : భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ప‌శ్చిమ బెంగాల్‌లోని విద్యాల‌యాల్లో ప్ర‌సారం చేయ‌బోమ‌ని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్ధ ఛటర్జీ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశం మేరకు ప్రకటనను జారీ చేసింది. షికాగోలోని ప్రపంచ మహాసభల్లో స్వామి వివేకానంద ప్రసంగించి సెప్టెంబ‌ర్ 11 నాటికి 25 ఏళ్లు పూర్తికావొస్తున్న సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌త్యేకంగా ప్రసంగించనుండడంతో ఈ ప్ర‌సంగాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా దేశంలోని అన్ని విశ్వ‌విద్యాల‌యాలు, క‌ళాశాల‌ల్లో ప్ర‌సారం చేయాల‌ని యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ (యూజీసీ) ఆదేశించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వ అనుమ‌తి లేకుండా ఇలాంటి ప్ర‌సంగాల‌ను ప్రసారం చేయలేమని కోల్‌కతాలో నిర్వహించిన మీడియా సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఛటర్జీ పేర్కొన్నారు. యూజీసీ నోటీసులు మేర‌కు ప‌శ్చిమ బెంగాల్‌లోని కళాశాలలు, విశ్వవిద్యాలయాలు విద్యాశాఖ‌ను ఆశ్రయించాయ‌ని, అయితే యూజీసీ నోటీసులను తప్పనిసరిగా అమలు చేయాల్సిన అవసరం లేద‌ని వారికి స్ప‌ష్టం చేసిన‌ట్లు మంత్రి తెలియ‌జేశారు. గతంలో కూడా ఇదే విధంగా మోడీకి సంబంధించి కార్యక్రమాలను ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం వ్య‌తిరేకించిన సంఘ‌ట‌న‌లు చాలానే ఎదురయ్యాయి.