కేసీఆర్ కొత్త అసెంబ్లీ ప్రతిపాదనకు రాజకీయ వారసత్వమే ప్రధాన కారణమా..?

SMTV Desk 2017-09-09 11:44:36  kcr revanth reddy, revanth reddy, revath reddy fire on kcr, revanth reddy fire on new assembly

హైదరాబాద్ సెప్టెంబర్ 9: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అసెంబ్లీ నిర్మాణానికి సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ పరిధిలో ఉన్న బైసన్ పోలో గ్రౌండ్ సౌకర్యంగా ఉంటుందని ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి తెచ్చుకున్న విషయం అందరికీ విదితమే. అయితే ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ సౌకర్యవంతంగా ఉన్నా కేసీఆర్ కొత్త అసెంబ్లీ నిర్మాణానికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపడం పట్ల ప్రతిపక్షాలు కేసీఆర్ ను పిచ్చి తుగ్లక్ తో పోల్చుతున్నాయి. అయితే కేసీఆర్ కొత్త అసెంబ్లీ నిర్మాణానికి పూనుకోవడం వెనక ఒక ప్రధాన కారణం ఉందని టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అదేంటంటే.. గతం నుండి ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన వారిలో కనీసం ఒక్కరి కుమారులైనా తన తండ్రి తర్వాత సీఎం అయిన దాఖలాలు ఎక్కడా లేవు. అయితే ఈ విషయాన్ని గమనించిన కేసీఆర్ అసెంబ్లీ వాస్తు సరిగా లేదనే ప్రధాన కారణంతో ప్రజలను నమ్మించి కొత్త అసెంబ్లీ నిర్మాణానికి తయారవుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు. అయితే ఇక్కడ రేవంత్ చేసిన ఆరోపణలు ఒక్క సారి పరిశీలిస్తే ఇది ఒకంతు వాస్తవమనే అనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ తర్వాత తన కుమారుడైన కేటీఆర్ కే అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్న కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేయడంలో భాగంగానే నూతన అసెంబ్లీ నిర్మాణానికి పునుకొన్నారని తెలుస్తుంది.