అంటార్కిటికా పై శాస్త్ర‌వేత్తల దృష్టి!

SMTV Desk 2017-09-09 11:39:11  Antarctica, Polar continent, Scientists, Snow, Volcano eruption, Plants and animals DNA

అంటార్కిటికా, సెప్టెంబర్ 09 : అంటార్కిటికా భూమికి దక్షిణాన ఉన్న ధ్రువ ఖండం. ఇది దక్షిణార్థగోళంలో ఉంది. దీని విస్తీర్ణం ఒక కోటి నలభై నాలుగు లక్షల చ.కి.మీ. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ల తరువాత ఐదవ పెద్ద ఖండం. యూరప్ మరియు ఆస్ట్రేలియా దీనికంటే చిన్నవి. ఈ ఖండం 98% మంచుతో కప్పబడి ఉంది. ప్రపంచంలో కల్లా అతి చల్లని ప్రాంతం అవడం మూలాన ఇక్కడ శాశ్వతంగా నివసించే ప్రజలు ఉండరు. అంతే కాకుండా పూర్వకాలంలో కూడా ఇక్కడ జీవం ఉన్నట్టు ఆధారాలు లేవు. కేవలం చలికి తట్టుకొనే జంతువులు, మరియు మొక్కలు కొన్ని మాత్రమే ఇక్కడ జీవిస్తాయి. ఉదాహరణకు సీల్ చేపలు, పెంగ్విన్ పక్షులు, వివిధ రకాలైన ఆల్గే జాతికి చెందిన మొక్కలు మొదలైనవి ఇక్కడ ఉన్నాయి. కానీ ఇటీవల శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించిన విషయం ఒక్కటి ఉంది. అదేంటంటే అగ్నిప‌ర్వ‌తాలే కాకుండా కొన్ని అప‌రిచిత జీవుల‌తో నిండి ఉన్న ప్ర‌పంచం కూడా అంటార్కిటికా మంచు దుప్ప‌టి కింద ఉంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. మంచు కింద ఉన్న అగ్నిప‌ర్వ‌తాల విస్ఫోట‌నం వ‌ల్ల కొన్ని ప్రాంతాల్లో పెద్ద పెద్ద గుహలు ఏర్ప‌డ్డాయ‌ని, వాటిల్లో మ‌నుషుల‌కు అంతుచిక్క‌ని జీవ‌జాలం అభివృద్ధి చెంది ఉండ‌వ‌చ్చ‌ని ప‌రిశోధ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆ గుహల్లో ఉన్న వెచ్చ‌ద‌నం జీవుల మ‌నుగ‌డ‌కు, సంతానోత్ప‌త్తికి కావాల్సినంత ఉండ‌డంతో జీవ‌జాలం క‌చ్చితంగా ఇక్క‌డ నివ‌సించి ఉండ‌వ‌చ్చ‌ని వారు తెలిపారు. అక్కడి రోస్‌ ద్వీపం వద్ద ఎరెబస్‌ పర్వతం పరిసరాల్లో ఇలాంటి గుహలు శాస్త్ర‌వేత్త‌ల‌కు తారసపడ్డాయి. అక్కడి మట్టి నమూనాలను పరీక్షించిన వారికి మొక్క‌లు, జంతువుల డీఎన్ఏను పోలిన డీఎన్ఏ క‌నిపించింది. దీంతో ఈ ప్రాంతాల్లో ర‌హ‌స్య జీవులు ఉన్న‌ట్లుగా వారు అంచ‌నా వేశారు. దీంతో శాస్త్ర‌వేత్త‌లు అవి జీవించి ఉన్నాయా? వాటి ప్రత్యేకత‌లేంటి? వంటి విషయాల‌ను ప‌రిశోధించ‌డంపై దృష్టి సారించారు.