పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తా: చంద్రబాబు

SMTV Desk 2017-09-08 17:52:24  muchumarri lift irrigation inagration

కర్నూల్,సెప్టెంబర్ 08: ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పేదవాడికి అండగా ఉండడమే తన జీవితాశయమని తెలిపారు. కర్నూలు జిల్లా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి కోసం రాత్రింబవళ్లు పనిచేస్తున్నానని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వెనుకాడేది లేదని స్పష్టంచేశారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టానని, పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తున్నానని సీఎం తెలిపారు. నన్ను నమ్ముకున్న ప్రజల కోసమే పనిచేస్తానని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్‌ కొరతను అధిగమించామన్నారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవాలని, తద్వారా నీటి సమస్యను అధిగమించాలని చెప్పారు. రాబోయే రోజుల్లో విద్యుత్‌ ఛార్జీలు పెంచడం ఉండదని తెలిపారు. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామని, ఒక్కొక్క ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. పోలవరం పూర్తి చేసి జాతికి అంకితమివ్వడమే లక్ష్యమని తెలిపారు.