గౌరీ లంకేశ్ హంతకులను పట్టిస్తే బహుమతిని ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

SMTV Desk 2017-09-08 15:17:30  Gowri Langesh, The Karnataka government announced the prize, Karnataka Chief Minister Siddaramaiah

బెంగళూరు, సెప్టెంబర్ 08 : మూడు రోజుల క్రితం బెంగళూరులో దారుణ హత్యకు గురికాబడిన పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ ను హత్య చేసిన వారిని పట్టిస్తే రూ. 10 లక్షల బహుమతి ఇస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. కేసులో దర్యాఫ్తు జరుగుతున్న తీరును హోం మంత్రి రామలింగారెడ్డితో కలసి సమీక్షించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, త్వరగా నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు. కాగా, ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు కీలక ఆధారాలు సంపాదించినట్లు తెలుస్తోంది. ఓ అంచనా ప్రకారం హంతకుడి వయసు 30 సంవత్సరాల వరకూ ఉండవచ్చని, ముందు జాగ్రత్తతో హంతకుడు హెల్మెట్ ధరించి వచ్చాడని ఆపై పారిపోయాడని వెల్లడించారు. ఈ మేరకు నిందితుడి ఊహా చిత్రాన్ని రూపొందించి, అతని ఆచూకీ కోసం రాష్ట్రమంతా గాలిస్తున్నట్టు తెలిపారు. కాగా, లంకేశ్ కుటుంబీకులు కోరితే దర్యాఫ్తును సీబీఐకి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.