కూతురు శవాన్ని డ్రైనేజీలో పడేసిన తండ్రి

SMTV Desk 2017-06-04 17:44:39  milare devaram palli, laxmi guda, body drop down on drainege

హైదరాబాద్, జూన్‌ 4 : చనిపోయిన కూతురి పట్ల ఓ తండ్రి నిర్ధయగా వ్యవహరించాడు. అంత్యక్రియలకు డబ్బుల్లేవని ఆ శవాన్ని డ్రైనేజీలో విసిరేసి చేతులు దులుపేసుకున్న ఘటన మైలార్ దేవ్ పల్లి ఠాణాలో వెలుగు చూసింది. ఆ ఠాణా సిఐ జగదీశ్వర్ రెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. లక్ష్మీగూడ ప్రాంతానికి చెందిన పెంటయ్య, కమలమ్మ దంపతులకు తులసీరాం, భవానీ ఇద్దరు సంతానం. పెంటయ్య స్థానికంగా ఓ కంపెనీలో పనిచేసేవాడు. భార్యభర్తల మధ్య గొడవలు తలేత్తడంతో కమలమ్మ పుట్టింటికి వెళ్లిపోయింది. కుమారుడు తులసీరాం గత ఏడాది ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పెంటయ్య, కూతురు భవానీ ఇద్దరే ఇంట్లో నివసిస్తున్నారు. భవానీ ఏడవ తరగతి వరకు చదవి ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటుంది. గత నెల 10న రాత్రి సమయంలో భవానీ బయటకెళ్లి రావడంతో ఇరుగుపొరుగు ఆమె గురించి పెంటయ్యకు ఫిర్యాదు చేసారు. అవేమీ పట్టించుకోని పెంటయ్య డ్యూటీకెళ్లాడు. అయితే తండ్రి మందలిస్తాడనే భయంతో మరుసటి రోజే భవానీ బాత్ రూంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. డ్యూటీ నుండి వచ్చిన పెంటయ్య బాత్ రూంలో కూతురి మృత దేహాన్ని చూసి ఆందోళన కు గురయ్యాడు. ముందే అప్పుల్లో ఉండటం, కూతురు అంత్యక్రియలు నిర్వహించేందుకు డబ్బులు లేక పోవడం తో మృతదేహాన్ని స్థానికంగా ఉన్న డ్రైనేజీ కాలువలో పడేశాడు. మే 31న మురికి కాలువలో ఓ మృతదేహం ఉందని సమాచారం అందుకున్న మైలార్ దేవ్ పల్లి పోలీసులు శవాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. అయితే లక్ష్మీనగర్ కు చెందిన భవానీ కొన్ని రోజులుగా కనబడడం లేదని తెలుసుకున్న పోలీసులు పెంటయ్యను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా...అసలు విషయం వెలుగు చూసింది. కుమారుడు ఆత్మహత్య చేసుకున్నప్పుడు చేసిన అప్పే ఇంకా తీరనే లేదని, ఇప్పుడు కూతురు దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో డ్రైనేజీ కాలువలో పడేసినట్లు నిందితుడు అంగీకరించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పెంటయ్యను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.