కోటి మంది @ రూ. 5/- భోజనం

SMTV Desk 2017-05-28 10:44:26  Rs 5 food,Ghmc food,annapurna food,hyderabad food,ktr,ghmc commisioner

హైదరాబాద్, మే 26 : అన్నదాత సుఖీభవ అన్నట్లుగా సాగుతున్నది హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ నిర్వహిస్తున్న అన్నపూర్ణ క్యాంటీన్లు. రూ. 5/- కే అందిస్తున్న భోజనం పేద, మధ్య తరగతి వర్గాలను విపరీతంగా ఆకర్షిస్తూ కడుపు నింపుతోంది. హైదరాబాద్ వ్యాప్తంగా 121 ప్రదేశాలలో కొనసాగుతున్న అన్నపూర్ణ క్యాంటిన్లు, అన్నార్తులతో మధ్యాహ్న సమయంలో కిక్కిరిసి పోతున్నాయి. టీ తాగాలన్నా 10 రూపాయలు వెచ్చించాల్సిన ప్రస్తుత రోజుల్లో, ఐదు రూపాయల భోజనం సామాన్య పేద, మధ్య తరగతి వారిని ఎంతో ఆదుకుంటోంది. స్వచ్చతకు, పారదర్శకతకు నిదర్శనంగా నిలుస్తూ, సేవే ప్రధాన లక్ష్యంతో ముందుకు సాగుతున్న హరేకృష్ణ పౌండేషన్ సహకారంతో జిహెచ్ఎంసి అన్నపూర్ణ పథకాన్నిఅత్యంత విశేషమైన రీతిలో కొనసాగిస్తున్నది. గత రెండేళ్ళలో కోటి మంది వరకు అన్నపూర్ణ క్యాంటీన్ లలో ఐదు రూపాయల భోజనం చేశారని గణాంకాలు విశ్లేషిస్తున్నాయి. ఇందుకోసమై ఒక్కో భోజనాన్ని తయారు చేసి అన్నార్థులకు అందించేందుకు 24 రూపాయల 25 పైసల చొప్పున ఖర్చవుతుండగా, జిహెచ్ఎంసి 19 రూపాయల 25 పైసల చొప్పున జిహెచ్ఎంసి భరిస్తోంది. ఆ లెక్కన జిహెచ్ఎంసి గత రెండేళ్ళ కాలంలో 20 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. 2014 మార్చు 2న ప్రారంభమైన ఈ పథకంకు సంబందించిన వివరాలను జిహెచ్ఎంసి విడుదల చేసింది. అమీర్ పేట్, చిక్కడపల్లిలలో ఏర్పాటు చేసిన కేంద్రాలైతే ఎప్పుడు నిరుద్యోగులు, కళాశాల విద్యార్థులతో కిక్కిరిసి కనిపిస్తాయి. ఎటువంటి జంకు లేకుండా అన్ని రకాల ఆదాయ వర్గాల వారు రుచి చూస్తున్నారంటే, అన్నపూర్ణ క్యాంటిన్ ల పనితీరు ఎంత అద్భుతంగా ఉందో ఇట్టే అర్ధం అవుతుంది.