దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల మూసివేతకు మోదీ నిర్ణయం

SMTV Desk 2017-09-07 13:04:04  Closure of toll plaza, Modis decision, National Highways

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 07 : దేశంలో సొంత వాహనాల్లో రహదారి మీదుగా ఎక్కడికి వెళ్లాలన్నా టోల్ టాక్స్ కట్టాలి. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లాలన్నా టోల్ చెల్లించాలి. ఇక దూరప్రయాణమైతే ఈ టోల్ వేలల్లో ఉంటుంది. ఉదాహరణకు చెన్నై నుంచి కన్యాకుమారికి పోవాలంటే ఓ కారుకి రూ. 1500 కట్టుకోవాలి. దేశవ్యాప్తంగా ఈ వాహన చోదకులను ఇలా నిలువు దోపిడీ చేయడంపై టోల్ ప్లాజాల మూసివేతకు మోదీ సర్కార్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. 2014 ఎన్నికలకు ముందు బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టోలోని కీలకాంశాల్లో ఒకటైన టోల్ ప్లాజాల మూసివేతకు ఎన్డీయే సర్కారు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇక తన మేనిఫెస్టోలో ఇచ్చిన కీలక హామీగా ఉన్న టోల్ ప్లాజాల మూసివేతపై అధికారంలోకి వచ్చిన మూడేళ్ల వరకూ పట్టించుకోని బీజేపీ నేతృత్వంలోని కేంద్రం, ప్రస్తుతం ఆ ఆలోచన చేస్తున్నట్టు నేషనల్ హైవేస్ కు చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో 434 టోల్ ప్లాజాలు నడుస్తుండగా, కారుకో రేటు, లారీకో రేటు, బస్సుకో రేటు, పెద్ద వాహనాలకు మరో రేటు చొప్పున వసూలు చేస్తారన్న విషయం తెలిసిందే.