తమ్ముళ్లకు బాబు వార్నింగ్: మళ్లీ ఇదే రిపీటైతే చర్యలు తప్పవ్!..

SMTV Desk 2017-06-04 14:28:43  chandrababu, tdp, navanirmana dhiksha,

అమరావతి, జూన్ 4 : ఓవైపు తెలంగాణ జనం ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటుంటే.. మరోవైపు ఏపీకి మాత్రం ఇది చీకటి దినం అని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాజధాని అమ రావతిలో శుక్రవారం నవనిర్మాణ దీక్ష చేపట్టారు. నవనిర్మాణ దీక్షకు జనం నుంచి ఎలాంటి స్పందన వచ్చిందన్నది పక్కనపెడితే.. కొంతమంది సొంత పార్టీ నేతలే ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారట. దీంతో విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు సదరు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులే డుమ్మా కొడితే ఎలా? అని ఆయన మండిపడినట్లు చెబుతున్నారు. శుక్రవారం జరిగిన నవనిర్మాణ దీక్షకు ఎవరెవరు రాలేదన్న జాబితా బయటకు తీయగా.. 12మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎంపీలు గైర్హాజరైనట్లు చంద్రబాబు దృష్టికి వచ్చింది. మరోసారి ఇలాంటి అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించబోనని ఆయన తేల్చి చెప్పారట. శనివారం నుంచి ఏడో తేదీ వరకు కచ్చితంగా నేతలంతా పాల్గొనాల్సిందేనని గట్టిగా హెచ్చరించారట. ఇప్పటికీ తన వ్యాఖ్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే దానికి మూల్యం తప్పదని కూడా చెప్పారట. ఏది ఏమైన నిత్యం క్రమశిక్షణ మంత్రాన్ని జపించే చంద్రబాబు లాంటి నేతలకు సొంత గూటి నేతలే దాన్ని లెక్క చేయకపోవడం పట్ల అసహనంతో ఉన్నారట. క్రమశిక్షణ తప్పుతున్న తమ్ముళ్లను దారిలో పెట్టాలంటే ఇలాంటి హెచ్చరికలు తప్పవని భావిస్తున్నారట.