బ్రిక్స్ సదస్సులో భారత ప్రధాని మోదీ

SMTV Desk 2017-09-04 16:57:21  BRICS countries, Shaman in China, modi,Brazil, Russia, India, China and South Africa

షామన్, సెప్టెంబర్ 4 : ప్రపంచానికే పెను సవాల్ గా మారిన ఉగ్రవాదంపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. బ్రిక్స్ సభ్యదేశాలు సహా ప్రపంచంలో ఏ మూల ఉగ్రదాడి జరిగినా తీవ్రంగా ఖండిస్తామని స్పష్టం చేశాయి. చైనాలోని షామన్ లో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఈ మేరకు సభ్యదేశాలైన బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా తీర్మానం చేశాయి. ముఖ్యంగా ప్రాంతీయ భద్రతకు ముప్పు కలిగించే తాలిబన్ సహా పాక్ ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌ వంటి సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని పిలుపును ఇచ్చాయి. ఉగ్రవాదంపై పోరు ఉగ్ర సంస్థలకు అందే నిధులను అడ్డుకోవడంతో ప్రపంచ దేశాలు సమగ్రమైన విధానాన్ని రూపొందించుకోవాలని బ్రిక్స్ పిలుపును ఇచ్చింది. మరోవైపు నిన్న ఉత్తరకొరియా చేపట్టిన అణు పరీక్షను కూడా బ్రిక్స్ సదస్సు ఖండించింది. అంతకుముందు ప్లీనరీ సెషన్లో ప్రసంగించిన మోదీ ప్రపంచం అస్థిర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటే బ్రిక్స్ దేశాలు పురోగతి, స్థిరత్వం సాధిస్తూ సహకారం కోసం అద్భుతమైన కార్యాచరణ రూపొందిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. సభ్య దేశాల మధ్య మరింత పటిష్ట భాగస్వామ్యం అవసరమని స్పష్టం చేసిన మోదీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రభుత్వ ప్రైవేటు సంస్థల ఆర్థికఅవసరాలను తీర్చేందుకు బ్రిక్స్ డేటింగ్ సంస్థలను ఏర్పాటు చేయాలని మోదీ పిలుపు ఇచ్చారు. పేదరిక నిర్ముల విషయంలో బ్రిక్స్ దేశాలు తీవ్రంగా కృషిచేస్తున్నాయని తెలిపిన ప్రధాని మోదీ ఆరోగ్యం, పారిశుధ్యం, ఆహార భద్రత, లింగ సమానత్వం, విద్యా నైపుణ్యాలు అందరికీ అందించే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయని మోదీ వెల్లడించారు. బ్రిక్స్ ఆర్థిక, సాంకేతిక ప్రణాళిక కోసం రూ. 487 కోట్లు సమకూర్చుతున్నట్లు చైనా ప్రకటించింది. దీనికి అదనంగా రూ.26 కోట్లు నూతన అభివృద్ధి బ్యాంకు చేపట్టే ప్రాజెక్టుల కోసం కేటాయిస్తున్నట్లు చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తెలిపారు. అంతర్జాతీయ శాంతి సుస్థిరత కోసం 5 దేశాల బృందం పరిష్కారాలను అన్వేషించాలని జిన్ పింగ్ పిలుపునిచ్చారు. ఆర్థిక ప్రపంచీకరణ అందరికి లబ్ది చేకూరేలా బ్రిక్స్ దేశాలు కృషి చేయాలని సూచించారు.