కోదండరాం భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది..?

SMTV Desk 2017-09-04 13:28:16  kodandaram, jac, telangana jac, kodhandaram new political party, telangana politics, kcr kodandaram

హైదరాబాద్ సెప్టెంబర్ 4: ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో నాయకులను నడిపించిన నేతగా తెరాస అధినేత కేసీఆర్ పెరుగాంచగా, ప్రజలను, ప్రభుత్వ అధికారులను, సంఘాలను ఒక్క తాటిపై నడిపిన వ్యక్తిగా తెలంగాణ ఐక్య కార్యాచరణ సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పేరుగాంచారు. అయితే వీరిద్దరి నాయకత్వ పటిమతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఎలాంటి తగాదాలు మొదలయ్యాయో తెలియదు గానీ వీరిద్దరి తీరు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారవ్వడం అందరికీ తెలిసిందే. అయితే అప్పటి నుండి కోదాడరాం టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడం ప్రారంభించారు. ప్రభుత్వ లోపాలను వెలికి తీసి వాటిని హైలెట్ చేయడం, కేసీఆర్ ను విమర్శించడం మొదలుపెట్టారు. కానీ కేసీఆర్ మాత్రం ఆయనపై ఎలాంటి విమర్శలను చేయకపోవడం ఆయన హోదాకు గౌరవం ఇవ్వడం ఇవన్నీ మనం గమనించవచ్చు. అయితే ఈ విభేదాన్ని గమనించిన ప్రతిపక్షాలు ఆయన్ని తమ తమ పార్టీల్లో చేర్చుకోవడానికి విశ్వ ప్రయత్నమే చేశాయి. కానీ ఆయన మాత్రం ఈ ఆఫర్లను సున్నితంగా తిరస్కరించారు. ఇప్పుడు కోదండరాం కొత్త పార్టీ పెడుతున్నారనే వార్తలు మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఆయన పార్టీ పెడితే ఆ ప్రభావం ఇతర పార్టీలపై ఏ విధంగా ఉంటుంది..? అన్న ఊహాగానాల్లో పార్టీలన్నీ మునిగి తేలుతున్నాయి. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కోదండ రాం వ్యూహం ఏ విధంగా సాగుతుంది..? అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఆయన కొత్త పార్టీ ప్రారంభిస్తారా..? లేక అప్పటి పరిస్థితులను బట్టి ఏ పార్టీకైనా ఆకర్షితులు అవుతారా..? లేక ఎలాంటి కార్యాచరణకు పాల్పడకుండా తటస్థంగా ఉంటారా..? అనేది తెలియాలంటే మాత్రం ఎన్నికల సమయం వరకు వేచి చూడాల్సిందే...!