మెరుగైన వైద్య సేవలు అందిస్తాం

SMTV Desk 2017-06-04 11:32:24  kcr kit, lanch kcr kit scheeme, kcr, cm kcr

హైదరాబాద్, జూన్ 4: ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు పెంపొందించేందుకు, బాలింతలు, శిశుమరణాలను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం కింద కేసీఆర్ కిట్ లను పంపిణీ చేసే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొని వితరణ చేశారు. హైదరాబాద్ లోని పేట్ల బురుజు మోడర్న్ మెటర్నిటీ ఆసుపత్రిలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కేసీఆర్ కిట్ పథకం ద్వారా శిశువులకు వివిధ సపర్యలు నిర్వహించేందుకు అవసరమైన వివిధ వస్తువులు, ముఖ్యంగా బ్రాండేడ్ జాన్సన్ అండ్ జాన్సన్ కంపేనీకి చెందిన వివిధ ఉత్పత్తులు అమరికగా పొందుపర్చి ఉంటాయి. అదే విధంగా ఆడపిల్లకు జన్మనిచ్చిన బాలింతకు 13 వేల రూపాయలు, మగపిల్లవాడికి జన్మనిచ్చిన బాలింతకు 12 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు. పేట్ల బురుజు ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చిన రషీదాబేగం, మగబిడ్డకు జన్మనిచ్చిన సరితమ్మ, మెహజెమీన్, సబిత తదితరులకు కిట్ లను ముఖ్యమంత్రి కేసీఆర్ పంపిణి చేశారు. అనంతరం కేసీఆర్ కిట్స్ వెబ్ సైట్ ను ఆయన ప్రారంభించి..ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను వీక్షించారు. ఆస్పత్రిలోని అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్, ఎమర్జెన్సీ వార్డు, జనరల్ వార్డు, స్టెబిలైజేషన్ విభాగాలను పరిశీలించి రోగులు, సిబ్బం దితో మాట్లాడారు. పథకాన్ని ప్రారంభిస్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రుల్లో మానవత్వం తో కూడిన వైద్యసేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వాసుపత్రుల్లో వసతి, సౌకర్యాలను పెంపోందించామని..ఫలితంగా ప్రభుత్వాసుపత్రులను ఆశ్రయించే గర్భిణీలు, రోగుల సంఖ్య పెరుగుతూ వస్తుందని వివరించారు. పేట్ల బురు ఆస్పత్రి విషయానికోస్తే ఇక్కడ ఉన్న 462 పడకలకు గాను 700 మంది వైద్య సేవల కోసమై వచ్చారని. . .అయినా సరే పడకలు లేవంటూ తిప్పి పంపడం లేదని చెప్పారు. పేట్ల బురుజు ఆస్పత్రిలో మహాలక్ష్మీ అనే డాక్టర్ గొప్పగా సేవలందించారని..ఆమె అందించే వైద్య సేవల కోసమై ధనవంతులు సైతం క్యూ కట్టేవారని గుర్తు చేశారు. తిరిగి ఆసుపత్రిలో అలాంటీ సేవలు అందేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.గతంలో రోగుల బంధువులు ఉండేందుకు వీలుగా ప్రభుత్వాసుపత్రులకు అనుబంధంగా ధర్మశాలలు ఉండేవని..మళ్ళీ అలాంటి ధర్మశాలలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ ఆసుపత్రిలో మరో బ్లాక్ నిర్మిస్తామని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. నర్సింగ్ సిబ్బందికి స్టైఫండ్, మెస్ నిర్వహణ కు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. ఆసుపత్రిలో రోగులకు ఇబ్బంది ఏర్పడుతుందని మైకు పట్టకుండానే ముఖ్యమంత్రి కార్యక్రమం పూర్తి చేశారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహ్మద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, లక్ష్మారెడ్డి, శాసన సభ్యులు ఖాద్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ పి సింగ్ లతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.