తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న రామ్ నాథ్ కోవింద్

SMTV Desk 2017-09-01 17:26:15  Indian President Ram Nath Kovind, Thiruchanur Amman, Renigunta Airport, CM Chandrababu

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1 : భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరుచానూరు అమ్మవారిని నేడు దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఆలయ అధికారులు కోవింద్ కు ఘనస్వాగతం పలికారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుమల, తిరుపతికి విచ్చేసిన రామ్ నాథ్ కోవింద్ కు రేణిగుంట విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు, గవర్నర్ నరసింహన్ లు ఘనస్వాగతం పలికారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా కోవింద్ తిరుచానూరు చేరుకుని పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల ప్రాంగణంలో రూ.140 కోట్లతో నిర్మించిన శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఆసుపత్రి భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పౌర సన్మాన కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొనడం జరుగుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న రెండు పథకాలను ఆయన ఆవిష్కరించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న రామ్ నాథ్ కోవింద్, తిరుమల శ్రీవారిని రేపు దర్శించుకోనున్నారు. కోవింద్ కు ఘన స్వాగతం పలికేందుకు సీఎంతో పాటు మంత్రులు అచ్చం నాయుడు, దేవినేని ఉమ, లోకేశ్, అమర్ నాథ్ రెడ్డి, కళా వెంకట్రావు, పితాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.