శిల్పా సోదరులను వదిలిపెట్టనంటున్న అఖిలప్రియ

SMTV Desk 2017-09-01 17:24:10  Nandyala, TDP, Minister akhilapriya, Silpa brothers, YSRCP

నంద్యాల, సెప్టెంబర్ 1: నంద్యాల ఉపఎన్నికల్లో భారీ మెజార్టీతో టీడీపీ విజయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు నంద్యాల టౌన్ హాల్లో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అఖిల ప్రియ మాట్లాడుతూ... ఉపఎన్నికల్లో గెలుస్తే మగాళ్లం, లేకపోతే ఆడవాళ్లమని ప్రచారం చేసిన ఆయన ఇప్పుడు ఎక్కడికి పారిపోయారని హెద్దెవ చేశారు. నంద్యాలలో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించిన శిల్పా మోహన్ రెడ్డిని వదిలేది లేదని, నంద్యాల ప్రజల ముందుకు వచ్చి రాజకీయ సన్యాసం చేస్తున్నానని చెప్పేంత వరకు వారిని వదిలి పెట్టనని హెచ్చరించారు. ప్రస్తుతం ఓటమి పాలైన శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డిలు పారిపోయారన్నారు. గతంలో భూమా నాగిరెడ్డి విజయం సాధించినప్పుడు కూడా శిల్పా సోదరులు ఇలానే కనిపించకుండా వెళ్లిపోయారని, ఇప్పుడు అదే పని చేశారని ఆమె అన్నారు. శిల్పా సహకార్, శిల్పా బ్యాంక్‌లు ప్రజలను మభ్యపెట్టేందుకే వారు ప్రారంభించారని ఆమె మండిపడ్డారు. కాగా, ఈ సభకు నంద్యాల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డిలతో పాటు మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు కూడా విచ్చేశారు.