తెలంగాణ ఉపాధ్యాయులకు పదోన్నతులు

SMTV Desk 2019-11-26 12:00:56  

తెలంగాణ ఉపాధ్యాయులకు పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం ఉదయం పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ విజయ్‌ కుమార్, ఉన్నతాధికారులు, ఉపాద్యాయ ఎమ్మెల్సీలతో సమావేశమయ్యి పదోన్నతుల గురించి చర్చించారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పదోన్నతులకు ప్రతిపాదనలు పంపించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. అలాగే వేర్వేరు జిల్లాలో పనిచేస్తున్న జీవితభాగస్వాములను ఒకే జిల్లాకు బదిలీ చేసేందుకు వీలుగా పెండింగులో ఉన్న అంతర్ జిల్లా బదిలీల ప్రతిపాదనలను కూడా పంపించవలసిందిగా ఆదేశించారు. రాష్ట్రంలో 7వ తరగతి వరకు ఆంగ్లమాద్యమం కలిగిన ప్రభుత్వ పాఠశాలలో 8 నుంచి 10 వతరగతి వరకు ఆంగ్లమాద్యమం భోదించేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆవిధంగా 10వ తరగతి వరకు అప్‌ గ్రేడ్ చేసే అధికారాలను జిల్లా విద్యాశాఖాధికారులకు అప్పగించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. పదోన్నతుల ప్రక్రియలో ఎటువంటి వివాదాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు.