విధుల్లోకి వస్తున్న ఆర్టీసీ కార్మికులు...అరెస్ట్ చేస్తున పోలీసులు!

SMTV Desk 2019-11-26 11:58:24  

52 రోజులు వరకు నిర్విరామంగా కొనసాగిన సమ్మె ముగియడంతో తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు డిపోలకు చేరుకుంటున్నారు. ఉదయం 5 గంటల నుంచి డిపోల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ డిపో దగ్గర చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అలాగే డిపోల దడగ్డగర పోలీసుల్ని భారీగా మోహరించారు. కొన్ని డిపోల దగ్గర పోలీసులు-కార్మికుల మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడక్కడా తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను ఆర్టీసీ కార్మికులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. కార్మికులను విధుల్లోకి తీసుకోకపోవడానికి కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్ రాజిరెడ్డి. డిపో మేనేజర్లకు లిఖితపూర్వకంగా లేఖలు ఇచ్చినా విధుల్లోకి ఎందుకు చేర్చుకోవడం లేదని ప్రశ్నించారు. డిపోలకు కిలోమీటర్ల దూరంలోనే కార్మికుల్ని అరెస్ట్ చేస్తున్నారని.. డిపోలను అష్టదిగ్బంధంలో ఉంచడారని మండిపడ్డారు. హైకోర్టు సమ్మె చట్ట విరుద్దమని చెప్పలేదని.. సమ్మె చేయాలన్నా.. విరమించాలన్నా ఆర్టీసీ ఎండీ అనుమతి అవసరం లేదన్నారు. ఇదిలా ఉంటే కార్మికులను విధుల్లోకి తీసుకునేది లేదని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ తేల్చి చెప్పారు. ఇష్టం వచ్చినప్పుడు విధుల్లో చేరతామంటే ఎలా అని ప్రశ్నించారు. లేబర్ కోర్టు తీర్పు వచ్చే వరకు సంయమనం పాటించాలననారు. ఆర్టీసీ సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల జేఏసీ నేతలు పంపించిన లేఖను తీసుకునేందుకు నిరాకరించారు.. ఆ లేఖను సునీల్ శర్మ తిప్పి పంపించారు. ప్రభుత్వం కార్మికుల్ని వెనక్కు పంపిస్తుండటంతో గందరగోళం ఏర్పడుతోంది. లేబర్ కోర్టు తీర్పు వచ్చే వరకు కార్మికుల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆర్టీసీ జేఏసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలోనూ లేబర్ కోర్టు తీర్పు వచ్చాక నిర్ణయమనడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.