తెలంగాణాలో ప్రభుత్వ పాఠశాలలను మూసివేసేందుకు రంగం సిద్ధం

SMTV Desk 2019-11-20 12:58:36  

తెలంగాణాలో ప్రభుత్వ పాఠశాలలను మూసివేసేందుకు రంగం సిద్ధమౌతోంది. విద్యాహక్కు సవరణలో భాగంగా పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది విద్యాశాఖ. మరోవైపు పేదలకు విద్యను దూరం చేసేందుకే ఇటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ సవరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తామని స్పష్టం చేసింది టీఎస్ యూటీఎఫ్‌.


విద్యార్థులు ఎక్కువగా లేని ప్రభుత్వ పాఠశాలలను మూయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.. ఇందులో భాగంగానే ఊరికి, పాఠశాలకు మధ్య దూరాన్ని 5 కిలోమీటర్లకు పెంచాలని నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. దీనిపై ఓ ప్రత్యేకంగా కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కమిటీలో హైదరాబాద్‌ ఆర్జేడీ, డీఈవో, రంగారెడ్డి డీఈవో, రెండు జిల్లాల నుంచి ఒక డిప్యూటీ ఈవో, ఎంఈవోతో పాటు ఏఎ్‌సపీడీ సభ్యులుగా ఉన్నారు. విద్యాహక్కు చట్టం సవరణలపై పరిశీలన చేయాలని విద్యాశాఖ ఈ కమిటీని ఆదేశించింది. దీనిపై ఈ నెల 22న సమావేశం నిర్వహించనున్నారు.