ఢిల్లీ లో జనసేన

SMTV Desk 2019-11-16 14:12:39  

హస్తినలో మకాం వేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. శుక్రవారం ఢిల్లీ చేరుకున్న పవన్... ఇప్పుడు ఎవరెవరిని కలుస్తారో అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. హస్తిన పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌ షాతో పాటు పలువురు బీజేపీ నేతలను కలవనున్నట్టు ప్రచారం మాత్రం జరుగుతోంది. ఢిల్లీ పర్యటనపై గతంలోనే సంకేతాలిచ్చిన పవన్... భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ఇటీవల విశాఖలో లాంగ్‌ మార్చ్‌ నిర్వహించారు. ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ఏపీ ప్రభుత్వం స్పందించకపోతే ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలుస్తానని ప్రకటించారు. ఇక, లాంగ్ మార్చ్‌కి తోడు ఇంగ్లీష్ మీడియం వ్యక్తిగత దూషణల వరకు వెళ్లింది.. వైసీపీ, జనసేన నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధమే జరుగుతోంది.


ఇలాంటి సమయంలో ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్.. ఎవరెవర్ని కలుస్తారు?.. వైసీపీపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. హోదాపై కేంద్రాన్ని అడుగుతారా, రాజకీయ పరిణామాలు ఎలాంటి మలుపు తిరుగుతాయనేది కూడా చూడాల్సి ఉంది. పవన్ ఢిల్లీ టూర్ పై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. చంద్రబాబే పవన్ ను బీజేపీ పెద్దల వద్దకు రాయబారానికి పంపారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, దీనిని టీడీపీ కొట్టిపారేసింది. ఇక, హస్తినలో ఉన్న పవన్ ఇవాళ ఎవరిని కలుస్తారు? ఏం ఫిర్యాదు చేస్తారు? ఏం అడగనున్నారు? అనే ఆసక్తి మాత్రం నెలకొంది.