ఏపీలో మందుబాబులకు కష్టాలు ...పక్క రాష్ట్రానికి పరుగులు..

SMTV Desk 2019-11-16 14:09:53  

పొందంతా కష్టం చేసి రాత్రికి ఓ పెగ్గు వేసి పడుకోవాలి అనుకునేవాళ్లు కొందరైతే.. డ్యూటీ ముగియగానే ఫ్రెండ్స్‌లో గట్టిగా తాగిపడిపోవాలి అనుకునేవాళ్లు మరికొందరు.. అయితే, ఇప్పుడు మద్యం ధరలు పెరగడంతో ఏపీలో మందుబాబులకు కష్టాలు వచ్చిపడ్డాయట.. దానికి తోడు మద్యం దుకాణాల సమయం కూడా కుదించడంతో.. తమ మందు దాహాన్ని తీర్చుకోవడానికి రాష్ట్రం సరిహద్దులు దాటి పక్కరాష్ట్రంలోని వైన్స్‌లకు వెళ్తున్నారట. ఇది ముఖ్యంగా ఏపీ, తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో జరుగుతోంది. ఏపీ నుంచి తెలంగాణకు వస్తే మద్యం ధర తక్కువ ఉండటంతో పాటు, మద్యం షాపులు ఎక్కువ సమయం తెరచి ఉండటమే దీనికి కారణంగా చెబుతున్నారు.


ఏపీలో మద్యం ధరలు ఎక్కువ.. దానికి తోడు రాత్రి 8 గంటలకే మద్యం దుకాణాలు మూతపడుతున్నాయి.. దీంతో సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు.. తెలంగాణకు క్యూకడుతున్నారు. దీంతో సరిహద్దుల్లోని మద్యం దుకాణాల్లో అమ్మకాలు 3 రెట్లకు పైగా పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ, వీరులపాడు లాంటి మండలాలు.. తెలంగాణకు పొరుగునే ఉంటాయి.. ఆయా మండలాలకు.. తెలంగాణలోని సూర్యాపేట, ఖమ్మం జిల్లాలు పొరుగునే ఉంటాయి.. దీంతో ఏపీ మందు బాబులు.. బోర్డర్ దాటేస్తున్నారట.. పేద, మద్యతరగతి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసే బ్రాండ్లు సీసాకు ధరలో తేడా రూ.40కిపైగా ఉంది. ఉదాహరణకు తెలంగాణలో మాన్షన్‌హౌస్‌ క్వార్టర్‌ రూ.110 అయితే ఏపీలో అది రూ.150, ఇక, ఫుల్‌బాటిల్‌ తెలంగాణలో రూ.450 అయితే ఏపీలో రూ. 610.. ఇలా ఏ బ్రాండ్ తీసుకున్నా ఏపీ, తెలంగాణ మధ్య తేడాలున్నాయి. దీంతో.. తెలంగాణలో తమకు దగ్గరగా ఉన్న వైన్స్‌ షాపులకు వెళ్లి మద్యం కొనుగోళ్లు చేస్తున్నారు. దానికి తోడు.. అక్రమంగా మద్యాన్ని తీసుకెళ్లి.. స్థానికంగా అమ్ముతున్నట్టుగా కూడా తెలుస్తుండగా.. అప్రమత్తమైన ఏపీ ఎక్సైజ్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారని సమాచారం.