కోర్టుకు రామ్‌ చరణ్‌!

SMTV Desk 2019-11-14 12:13:29  

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కోర్టులో వాదనలు వినిపిస్తున్నాడు. తన మీద వచ్చిన అభియోగాలను తిప్పికొట్టేందుకు బలంగా వాదిస్తున్నాడు. చరణ్‌ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.ప్రస్తుతం రామ్‌ చరణ్‌ పోషిస్తున్న అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. కోర్టులో అల్లూరి వాదన వినిపిస్తున్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్‌లో రామ్‌ చరణ్‌తో పాటు పలువురు కీలక పాత్రదారులు నటిస్తున్నారు.బాహుబలి తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కావటంతో ఆర్ఆర్‌ఆర్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పీరియాడిక్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా ఎన్టీఆర్ తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీం పాత్రలో నటించనున్నాడు.రామ్‌చరణ్‌కు జోడిగా బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ నటిస్తుండగా, ఎన్టీఆర్‌ సరసన నటించాల్సిన విదేశీ భామను ఫైనల్‌ చేయాల్సి ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్ హీరో అజయ్‌ దేవగన్‌, కోలీవుడ్ నటుడు సముద్రఖనిలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాజమౌళి మార్కెట్ దృష్ట్యా ఈ సినిమాను కూడా పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య 400 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.