మహారాష్ట్రలో పోలిటికల్ ట్విస్ట్!

SMTV Desk 2019-11-12 14:39:20  

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు అనూహ్యమైన మలుపులు తిరుగుతున్నాయి. కాంగ్రెస్‌, ఎన్సీపీలు శివసేనకు మద్దతు ఇవ్వడానికి సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలు ఇవ్వడంతో శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే తన ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం సాయంత్రం మహారాష్ట్ర గవర్నర్‌ భగత్ సింగ్‌ కొషియారీని కలిసారు. తాము ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దంగా ఉన్నామని అయితే కాంగ్రెస్‌, ఎన్సీపీల నుంచి మద్దతు లేఖలు గవర్నర్‌కు సమర్పించడానికి మరో 48 గంటలు సమయం కావాలని కోరారు. కానీ గవర్నర్‌ వారి అభ్యర్ధనను తిరస్కరించి వెంటనే మూడవ అతిపెద్ద పార్టీగా నిలిచిన ఎన్సీపీని ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా ఆహ్వానించారు. మంగళవారం రాత్రి 8.30 వరకు ఎన్సీపీకి గడువు ఇచ్చారు. దీంతో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేయాలనే శివసేన ఆశలు ఆవిరైపోయాయి.

అయితే 54 సీట్లు మాత్రమే కలిగిన ఎన్సీపీ కూడా కాంగ్రెస్‌, శివసేన లేదా బిజెపిల మద్దతు లేనిదే ప్రభుత్వం ఏర్పాటుచేయలేదు. ప్రభుత్వ ఏర్పాటులో ఎవరి లెక్కలు వారికున్నాయి కనుక ఎన్సీపీకి మద్దతు లభించడం కష్టమే. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బిజెపికి శివసేన సహకరించలేదు కనుకనే రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించేందుకు ఆ పార్టీ గవర్నర్‌ను అడ్డంపెట్టుకొని ఈ నాటకం ఆడుతోందని శివసేన ఆరోపిస్తోంది. కనుక మహారాష్ట్ర రాజకీయాలలో ఈరోజు సాయంత్రంలోగా ఏమవుతుందో ఊహించడం కష్టమే.