రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోంది

SMTV Desk 2019-11-12 14:38:22  

అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడిన తెలంగాణ ఎన్ఆర్ఐలు నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజిగిరి కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి సిఎం కేసీఆర్‌ పాలన, ఆర్టీసీ సమస్యపై కేసీఆర్‌ వైఖరి గురించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

“ఆనాడు ఉద్యమ సమయంలో ప్రజలు కలలుగన్న తెలంగాణ వేరు. ఇప్పుడున్న తెలంగాణ వేరు. ప్రస్తుతం రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోంది. ఆర్టీసీ కార్మికులు 37 రోజులుగా రోడ్లపైకి వచ్చి సమ్మె చేస్తున్నా సిఎం కేసీఆర్‌ ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని తెరాస హామీ ఇవ్వలేదని వాదిస్తున్న సిఎం కేసీఆర్‌, తెరాస అధికారంలోకి వస్తే ఆర్టీసీలో 50 శాతం ప్రైవేట్ పరం చేస్తామని చెప్పారా? రాజ్యాంగం, న్యాయస్థానాలు, ప్రజాస్వామ్యంపై గౌరవం లేని సిఎం కేసీఆర్‌ వాటిని తనకు నచ్చినట్లు అన్వయించుకొని వ్యవహరిస్తుంటారు. మోటరువాహనచట్టం సవరణలను చూపిస్తూ ఆర్టీసీని ప్రయివేటీకరణ చేయాలనుకోవడమే ఇందుకు తాజా ఉదాహరణ.

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే సివిల్ వార్‌కు దారి తీస్తాయేమోననే భయం కలుగుతోంది. ఒకప్పుడు నక్సలైట్లు అభివృద్ధిని అడ్డుకొనేవారనే అభిప్రాయం ఉండేది. కానీ నక్సలైట్లే ఉంటే ప్రభుత్వ చర్యలను గట్టిగా నిలదీసేవారేమో?అని ప్రజలు అనుకొనే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి.

ఒకవేళ సిఎం కేసీఆర్‌ పాలన నిజంగా అంత అద్భుతంగా ఉండి ఉంటే ఆయన కుమార్తె కవిత నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికలలో ఎందుకు ఓడిపోయారు? కొడంగల్‌ ఓడిపోయిన నేను మల్కాజిగిరిలో గెలవడం ఏమిటి? అంటే ఒక్కోసారి పరిస్థితులు అదుపు తప్పుతున్నప్పుడు ప్రకృతి శక్తులే వాటిని నియంత్రిస్తాయని అర్ధమవుతోంది.

కేసీఆర్‌...ఆయన కుటుంబ సభ్యుల వలననే తెలంగాణ వచ్చిందని చెప్పుకొంటున్నారు. మరి తెలంగాణ కోసం బలిదానాలు చేసుకొన్న 1,500 మంది సంగతి ఏమిటి? వారి కుటుంబాలకు ఏమిస్తే రుణం తీర్చుకోగలుగుతాము?” అని అన్నారు.