ఇక బాటిళ్లలో పెట్రోల్ విక్రయాలు బంద్!

SMTV Desk 2019-11-11 13:37:51  

కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని ఏ పెట్రోల్ బంకుల్లోనూ బాటిళ్లలో పెట్రోలును అమ్మరాదని నిర్ణయించింది. ప్లాస్టిక్ బాటిళ్లలో పెట్రోల్ విక్రయాలపై సర్కారు ఆంక్షలు విధించగా, రాష్ట్రంలోని అన్ని పెట్రోలు బంకుల్లో ఈ మేరకు బోర్డులు ఏర్పాటయ్యాయి.

వాస్తవానికి బైక్ ఎక్కడో ఆగిపోతేనో, స్నేహితుడి బైక్ రోడ్డుపై నిలిచిపోతేనో, బాటిల్ తీసుకుని వచ్చి పెట్రోల్ పోయించుకుని వెళుతుంటారన్న సంగతి తెలిసిందే., అయితే, ఇటీవలి కాలంలో రాష్ట్రంలో హత్యలు, ఆత్మహత్యలకు పెట్రోల్ ను వాడుతున్నారు. ఇటీవల అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దారు విజయారెడ్డిని, ఆమె కార్యాలయంలోనే దారుణంగా హత్య చేసిన ఘటన తెలిసిందే. ఆపై కూడా రెండు మూడు పెట్రోల్ బెదిరింపుల ఘటనలు చోటు చేసుకున్నాయి.

ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. బాటిళ్లలో పెట్రోల్ విక్రయించరాదని తేల్చి చెప్పింది. దీంతో బంకుల్లో "నో పెట్రోల్ ఇన్ ప్లాస్టిక్ బాటిల్" పేరిట బోర్డులు వెలిశాయి. టూ వీలర్లు అయినా, ఫోర్ వీలర్లు అయినా, వాహనం తెస్తేనే పెట్రోల్ పోయిస్తామని బంకుల యజమానులు తేల్చి చెబుతున్నారు. ఈ మేరకు తమకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని అంటున్నారు.