BIG NEWS: ఎన్డీఏకు శివసేన గుడ్‌బై!

SMTV Desk 2019-11-11 12:02:16  

మహారాష్ట్రలో రాజకీయాల్లో ఆదివారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించగా ఆ పార్టీ తిరస్కరించింది. దీంతో రెండో అతిపెద్ద పార్టీ శివసేనను గవర్నర్ ఆహ్వానించడంతో ఎన్సీపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీ ముందుకొచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని.. శివసైనికుడే ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ నేత సంజయ్‌ రౌత్‌ ప్రకటించారు. శివసేనకు మద్దతు ఇవ్వాలంటే ఎన్‌డీయే నుంచి బయటకు రావాల్సిందేనని ఎన్‌సీపీ షరతు విధించింది. దీనికి అంగీకరించిన శివసేన.. కేంద్రంలోని తన మంత్రితో రాజీనామాకు సిద్ధమైంది. కేంద్ర భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మంత్రి అరవింద్ సావంత్ సోమవారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు, ఎన్‌సీపీకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేందుకు శివసేన అంగీకరించినట్టు తెలుస్తోంది. శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్‌కు ఉప-ముఖ్యమంత్రి పదవి దక్కుతుందనే ఊహగానాలు జోరందుకున్నాయి. కేంద్ర మంత్రి అరవింద్ సావంత్ మాట్లాడుతూ.. అసంబద్ధమైన వాతావరణంలో తాను మంత్రిగా కొనసాగలేనని, అందుకే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దేవేంద్ర ఫడ్నవీస్‌ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతామని బీజేపీ ధీమా వ్యక్తంచేస్తూ వచ్చింది. ఏకైక పెద్ద పార్టీగా అవతరించడంతో అవసరమైతే ఇతరుల మద్దతు కూడగట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించింది. అయితే అనూహ్యంగా ఆ పార్టీ వెనక్కి తగ్గి, అందరినీ ఆశ్చర్యపరిచింది. గవర్నర్‌ ఆహ్వానం నేపథ్యంలో బీజేపీ కోర్‌ కమిటీ ఆదివారం రెండుసార్లు భేటీ అయి, ప్రభుత్వ ఏర్పాటుకు దూరంగా ఉండాలని తీర్మానించింది. శివసేన మద్దతు ఇవ్వకపోవడం వల్ల తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని శివసేన షరతు విధించి ప్రజా తీర్పును కించపరించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ ఆరోపించారు. అందువల్లే తాము ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాన్ని విరమించుకున్నామని పేర్కొన్నారు.