బాంగ్లాతో ఆఖరి టీ20...జట్టులో మార్పులు!

SMTV Desk 2019-11-09 16:36:50  

ఆదివారం రాత్రి జరగనున్న ఆఖరి టీ20కి భారత్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. మూడు టీ20ల ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ముగియగా.. ఢిల్లీ టీ20లో బంగ్లాదేశ్, రాజ్‌కోట్ టీ20లో భారత్ జట్టు విజయాన్ని అందుకుంది. దీంతో.. సిరీస్ 1-1తో సమమైన నేపథ్యంలో మూడో టీ20పై ఉత్కంఠ నెలకొంది. భారత్‌పై ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా బంగ్లాదేశ్‌ టీ20 సిరీస్ గెలవలేదు. తొలి రెండు టీ20ల్లోనూ పేలవ బౌలింగ్‌తో విమర్శలు ఎదుర్కొన్న ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్‌పై వేటు పడే సూచనలు కనిపిస్తున్నాయి. తొలి టీ20లో తాను వేసిన ఆఖరి ఓవర్‌లో చివరి నాలుగు బంతులకీ బౌండరీలు ఇచ్చిన ఖలీల్.. రెండో టీ20లో తాను వేసిన తొలి ఓవర్‌లో మొదటి మూడు బంతులకీ ఫోర్లు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో.. ఖలీల్ బౌలింగ్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. మూడో టీ20లో అతనిపై వేటు వేసి శార్ధూల్ ఠాకూర్‌ని జట్టులోకి తీసుకోవాలని టీమిండియా మేనేజ్‌మెంట్ చర్చించినట్లు తెలుస్తోంది. బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా వికెట్ కీపర్‌గానూ విఫలమైన రిషబ్ పంత్‌‌ని మూడో టీ20లో రిజర్వ్ బెంచ్‌పై కూర్చోబెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల భారీ స్కోర్లతో సూపర్ ఫామ్‌లో ఉన్న వికెట్ కీపర్/ బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్‌‌‌కి కనీసం ఆఖరి టీ20లోనైనా ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో.. తొలి రెండు టీ20ల్లోనూ రిజర్వ్ బెంచ్‌కి పరిమితమైన శాంసన్‌కి తుది జట్టులో చోటివ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకవేళ వికెట్ కీపర్‌గా పంత్‌ని కొనసాగించాలనుకుంటే.. అప్పుడు కేఎల్ రాహుల్ లేదా శిఖర్ ధావన్‌పై వేటు పడే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తంగా అయితే.. తుది జట్టులో కనీసం రెండు మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

మూడో టీ20కి భారత తుది జట్టు అంచనా: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ / సంజు శాంసన్, శివమ్ దూబే, కృనాల్‌ పాండ్య, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, చాహల్, శార్ధూల్ ఠాకూర్