విద్యుత్‌ శాఖ ఉద్యోగులు ఆఫీస్ లో కూడా హెల్మెట్ ధరిస్తున్నారు ... ఎందుకో తెలుసా ...

SMTV Desk 2019-11-06 13:10:59  

ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లాకు చెందిన విద్యుత్‌ శాఖ ఉద్యోగులు ప్రతిరోజూ హెల్మెట్‌ ధరించే ఆఫీసుకు వెళ్తారు. అంతేకాదు కార్యాలయానికి చేరుకున్న తర్వాత కూడా హెల్మెట్‌ పక్కన పెట్టకుండానే పనిచేసుకుంటారు. కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన మోటార్‌ వాహన సవరణ చట్టం మీద ఉన్న భయం వలనో, భక్తి వలనో వీరిలా చేస్తున్నారనుకుంటే పొరబాటే. పనిచేసే చోట ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు వేరే గత్యంతరం లేక ఈ మార్గం ఎంచుకున్నారు. విద్యుత్‌ శాఖకు చెందిన బాందా జిల్లాలోని ఓ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. కప్పు ఎప్పుడు ఊడి మీద పడుతుందో తెలియని దుస్థితి. కాస్త వర్షం పడినా పైనుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. ఈ విషయం గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఉద్యోగులే ఈ ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకున్నారు. ఇప్పుడు ఈ ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.