చర్చలు మొదలైతేగానీ అంత్యక్రియలు జరుపం

SMTV Desk 2019-11-01 15:28:58  

కరీంనగర్‌ డిపోలో ఆర్టీసీ డ్రైవరుగా పనిచేస్తున్న నగునూరి బాబు (52) మొన్న సరూర్‌నగర్‌ సభకు వెళ్లినప్పుడు గుండెపోటుతో మృతి చెందడంతో ప్రభుత్వ వైఖరి కారణంగానే ఆర్టీసీ కార్మికులు చనిపోతున్నారని ఆరోపిస్తూ ఆర్టీసీ కార్మిక సంఘాలు నిన్న కరీంనగర్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి.

దృవరు బాబు ఆకస్మిక మరణంతో రోడ్డున పడిన ఆయన కుటుంబం, తమలాగ మరో కుటుంబం నష్టపోకూడదనే ఉద్దేశ్యంతో ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు ప్రారంభించేవరకు డ్రైవర్ బాబుకు అంత్యక్రియలు జరుపబోమని కుటుంబ సభ్యులు భీష్మించుకున్నారు. వారికి మద్దతుగా జిల్లాలోని ఆర్టీసీ కార్మికులు, బిజెపి ఎంపీ బండి సంజయ్ కుమార్, ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తదితరులు తరలివచ్చారు.

తమ కోసం పోరాడుతున్న డ్రైవర్ బాబు కుటుంబానికి అన్ని జిల్లాల నుంచి ఆర్టీసీ కార్మికులు, నేతలు ఆరేపల్లి తరలివచ్చి సంఘీభావం తెలుపాలని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి పిలుపునీయడంతో ఆర్టీసీ కార్మికులు తరలివస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డితో సహా ఆర్టీసీ జేఏసీ నేతలు కూడా ఆరేపల్లి బయలుదేరారు. దాంతో ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఆరేపల్లిలో భారీగా పోలీసులను మోహరించారు.

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా బిజెపి అనుబంద విద్యార్దీ సంఘం ఏబీవీపి ఈరోజు కరీంనగర్‌ బంద్‌కు పిలుపునీయడంతో పట్టణంలో విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. దీంతో వరుసగా రెండవరోజు కరీంనగర్‌ బంద్‌ పాటిస్తున్నట్లయింది. ఆరేపల్లికి ఆర్టీసీ కార్మికులు, నేతలు తరలివస్తుండటంతో ప్రస్తుతం ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తవాతావరణం నెలకొనుంది.