కేసీఆర్‌ వంటి నేత చాలా అరుదు: చిన్న జియ్యర్ స్వామీజీ

SMTV Desk 2019-10-29 17:05:12  

సిఎం కేసీఆర్‌కు దైవభక్తి, ఆధ్యాత్మిక భావాలు ఎక్కువేనని అందరికీ తెలుసు. శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్‌ వద్ద గల త్రిదండి చిన్న జియ్యర్ స్వామీజీ ఆశ్రమంలో సోమవారం జరిగిన తిరునక్షత్ర మహోత్సవానికి సిఎం కేసీఆర్‌ దంపతులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, తనకు బాల్యం నుంచే తల్లితండ్రుల ద్వారా భగవద్భాక్తి అలవడిందని, అందుకే ఒకసారి స్వామీజీ సిద్ధిపేటలో అనుగ్రహసంభాషణలు చేయడానికి వచ్చినప్పుడు, తాను స్వయంగా 8 రోజులపాటు ఆయన కారు డ్రైవరుగా పనిచేశానని తెలిపారు. ఆ సందర్భంగా స్వామీజీ నుంచి అనేక ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోగలిగానని సిఎం కేసీఆర్‌ చెప్పారు. యాదాద్రి ఆలయం పునర్ణిమాణ పనులు త్వరలోనే పూర్తి కానున్నాయని, ఫిబ్రవరిలో అక్కడ స్వామీజీ ఆధ్వర్యంలో మహాసుదర్శన యాగం జరిపిస్తానని తెలిపారు.

చిన్న జియ్యర్ స్వామీజీ మాట్లాడుతూ, “సాధారణంగా రాజకీయ నేతలకు భక్తి ఉన్నప్పటికీ దేవుడి గురించి మాట్లాడేందుకు భయపడుతుంటారు. కానీ సిఎం కేసీఆర్‌ మాత్రం చాలా ధైర్యంగా హిందూమతం, దైవారాధన గురించి మాట్లాడుతుంటారు. సిఎం కేసీఆర్‌ స్వయంగా పూనుకొని యాదాద్రి ఆలయాన్ని దేశంలో కెల్లా గొప్ప ఆలయాలలో ఒకటిగా తీర్చిదిద్దారు. రాజకీయాలలో కేసీఆర్‌ వంటి చాలా అరుదుగా కనబడుతుంటారు. ఆయన బక్కవారైనా గొప్ప సమర్దుడైన నేతగా, పరిపాలకుడిగా మంచి పేరు సంపాదించుకొన్నారు. ఆయన నేతృత్వంలో రాష్ట్రంలో సర్వతోముఖాభివృద్ధి చెందుతోందని మేము భావిస్తున్నాం,” అని ప్రశంశలతో ముంచెత్తారు.