బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు...పరారైన తాత్కాలిక డ్రైవర్‌

SMTV Desk 2019-10-28 15:13:18  

హైదరాబాద్‌లో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ఎదురుగా ఉన్న వాహనాలపైకి వేగంగా దూసుకెళ్లింది. దీంతో పలు వాహనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. సోమవారం ఉదయం జేబీఎస్‌ నుంచి జనగామకు వెళ్తుండగా హబ్సీగూడ సిగ్నల్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయానికి బస్సులో 8 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటన అనంతరం బస్సును అక్కడే వదిలేసి తాత్కాలిక డ్రైవర్‌ పరారయ్యాడు. ఈ ఘటనతో ఆ మార్గంలో కాసేపు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ముందున్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు కార్లు ధ్వసంమయ్యాయి.ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా బస్సులను నడిపేందుకు తాత్కాలిక డ్రైవర్లను నియమిస్తోంది. బస్సులు నడపడంలో అనుభవం లేని డ్రైవర్లతో బస్సులు నడిపించడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పదిహేను రోజుల కిందట కూకట్‌పల్లిలో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును మరో బస్సు వెనకా నుంచి బలంగా ఢీకొట్టడటంతో ప్రయాణికులంతా ఆందోళనకు గురైన సంగతి తెలిసిందే. తాత్కాలిక డ్రైవర్ మద్యం సేవించి బస్సు నడిపినట్టు గుర్తించిన ప్రయాణీకులు.. అతడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన మరవక ముందే అంబర్‌పేటలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని బస్సు ఢీకొట్టడటంతో అతడు మృతిచెందాడు.తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో అడపాదడపా నడుస్తున్న ఆర్టీసి బస్సులు ఎక్కేందుకు జనం భయపడుతున్నారు. మరికొన్ని డిపోల పరిధిలో డిపో నుంచి బస్సు బయటకు తీసిన తర్వాత నిర్ణీత నెంబర్ రూటులో ఎక్కడెక్కడ బస్సు నిలపాలో కూడా తెలియక డ్రైవర్లు అయోమయానికి గురవుతున్నారు. డ్రైవర్‌కు పూర్తి స్థాయిలో నైపుణ్యత కలిగి, సేఫ్‌గా నడపగలిగితే వందల మంది ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు వెళ్తారనే విషయాన్ని గుర్తించి, తాత్కాలిక డ్రైవర్లను నియమించాలని ప్రజలు కోరుతున్నారు. సమ్మె కారణంగా అడపాదడపా అందుబాటులో ఉన్న ఆర్టీసీ బస్సులు సైతం ప్రజలను ఇలా పరేషాన్ చేస్తున్నాయి.