మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి!!

SMTV Desk 2019-10-25 14:57:03  

శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేయే రాబోయే రోజుల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అంటూ ఆ పార్టీ కార్యకర్తలు పోస్టర్లు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమి మెజార్టీ సాధించిన విషయం తెలిసిందే. వర్లి నుంచి పోటీ చేసిన ఆదిత్య ఠాక్రే భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బీజేపీని శివసేన డిమాండ్ చేస్తుండడంతో ఆ నియోజక వర్గంలో ఈ పోస్టర్లు వెలిశాయి.

బీజేపీతో తమ మిత్రత్వం కొనసాగుతుందని, ఆదిత్య ఠాక్రేకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరతామని ఇప్పటికే శివసేన నేత సంయజ్ రౌత్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఇదే విషయంపై ఉద్ధవ్ ఠాక్రే కూడా మాట్లాడారు. సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలని స్పష్టం చేశారు. 50-50 ఫార్ములా అమలు చేయాలని భావించాం. దీనిపై చర్చలు జరిపి, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించాలన్న విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అని అన్నారు.

ఇరు పార్టీల నేతలు రెండున్నరేళ్ల చొప్పున ముఖ్యమంత్రిగా కొనసాగాలని శివసేన నేతలు అంటున్నారు. తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నేతలతో ఉద్ధవ్ ఠాక్రే ఈ రోజు సమావేశం ఏర్పాటు చేశారు. 288 సీట్లకు జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి 161, కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి 98, మజ్లిస్‌ 2 స్థానాల్లో గెలుపొందగా 27 స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు.